calender_icon.png 20 October, 2025 | 7:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యపై రాజీ లేదు అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్య

20-10-2025 12:42:39 AM

యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణ పనులు పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

ఖమ్మం, అక్టోబరు 19 (విజయక్రాంతి): విద్య విషయంలో ఎటువంటి రాజీ లేదని, అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన, ప్రణాళిక శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు.  బోనకల్ మండలం లక్ష్మీపురం లో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి ఆదివారం పరిశీలించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, నిర్మాణంలో ఎక్కడ రాజీ పడవద్దని అధికారులకు సూచించారు.  యంగ్ ఇండియా స్కూల్ ను అనుసంధానం చేస్తూ నిర్మించే రహదారులపై  అధికారులతో చర్చించారు.యంగ్ ఇండియా స్కూల్  కోసం సూచించిన ప్లాన్ ప్రకారం నిర్మాణాలు జరగాలని అన్ని వసతులతో కూడిన సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు.  నిర్మాణం కోసం ఉపయోగించే మెటీరియల్ విషయంలో కూడా ఎక్కడ రాజీ పడొద్దని తెలిపారు. 

నిర్మాణ పనుల్లో మరింత వేగాన్ని పెంచాలని అందుకు అవసరమైన కూలీలను వెంటనే ఏర్పాటు చేసుకోవాలని గుత్తేదారులకు సూచించారు.యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణ దశలో ఉన్న పునాదులను దగ్గరుండి పరిశీలన చేశారు.నిర్మాణ దశలో ఉన్న పాఠశాల ప్రాంగణాన్ని కలిగి తిరుగుతూ అధికారులతో కలిసి పరిశీలన చేశారు. విద్య అనేది భవిష్యత్తు తరాలకు మనం అందించే ఒక అతిపెద్ద ఆస్తి అని అన్నారు.

తెలంగాణ బిడ్డలకు అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించాలని సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, ఆర్ అండ్ బి ఎస్‌ఇ యాకోబు, పీఆర్ ఎస్‌ఇ వెంకట్ రెడ్డి, ట్రాన్స్కో ఎస్‌ఇ శ్రీనివాసాచారి,

మిషన్ భగీరథ ఎస్‌ఇ శేఖర్ రెడ్డి, విద్యాశాఖ ఇఇ బుగ్గయ్య, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, వ్యవసాయ శాఖ ఏడి విజయచందర్, బోనకల్ మండల తహసీల్దార్ రమాదేవి, ఎంపిడివో రమాదేవి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.