20-09-2025 12:00:00 AM
చేవెళ్ల, సెప్టెంబర్ 19: హైదరాబాద్‌బీజాపూర్ జాతీయ రహదారి (ఎన్హెచ్-163) విస్తరణకు అడ్డంకులు తొలగిపోనున్నాయి. మర్రిచెట్లపై ఎన్టీజీలో కేసు కారణంగా నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉన్న అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ(46 కిలోమీటర్లు) రోడ్డు పనులకు త్వరలో మోక్షం లభించనుంది. ఎన్ హెచ్ ఏఐ అధికారులు 80 శాతం చెట్లను పూర్తి స్థాయిలో కాపాడేలా.. 20 శాతం చెట్లను రీ లొకేట్ చేసేలా అలైన్ మెంట్ లో మార్పులు చేశారు.
రెండు బైపాసులు, సెంట్రల్ మీడియన్ స్థలాన్నిను తగ్గించడం, చెట్లకు ఇరువైపులా రోడ్డు వేయడం ద్వారా 765 చెట్లను రక్షించనున్నారు. 150 చెట్లు మాత్రం డిజైన్ కు అనుకూలంగా లేకపోవడంతో ట్రాన్స్ లొకేట్ పద్ధతిలో పక్కన తిరిగి నాటనున్నారు.
ఈ డిజైన్ కు పర్యావరణ వేత్తలు కూడా అంగీకరించడంతో రిపోర్ట్‌ను ఎన్జీటీకి సమర్పించారు. ఈ నెలాఖరులోగా గ్రీన్ ట్యిబ్యునల్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉందని, వచ్చే నెలలో పనులు ప్రారంభిస్తామని ఎన్ హెచ్ ఏఐ పీడీ నాగేశ్వర రావు తెలిపారు. ఏడాదిన్నరలోనే పనులు పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు.
ఇప్పటికే భూసేకరణ పూర్తి
స్టేట్ హైవేగా ఉన్న హైదరాబాద్‌బీజాపూర్ రోడ్డును కేంద్రం 2018లో ఎన్హెచ్ 163గా అప్గ్రేడ్ చేసింది. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46 కిలో మీటర్ల మేర రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించాలని నిర్ణయించి.. రూ.928.41 కోట్లు మంజూరు చేసింది. దారి పొడవునా 18 అండర్ పాసులు, మొయినాబాద్ సమీపంలో 4.35 కి.మీ, చేవెళ్ల సమీపంలో 6.36 కి.మీ. మేర బైపాస్లు నిర్మించనున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు 29 ఏప్రిల్ 2022లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శం కుస్థాపన చేశారు. టెండర్ ప్రాసెస్ కూడా పూర్తి కావడంతో పనులు చేపట్టిన అధికారులు 143 హెక్టార్ల భూసేకరణ చేసి.. రైతులకు రూ.200 కోట్ల పరిహారం కూడా చెల్లించారు. అయితే దారికి ఇరువైపులా 915 మర్రి చెట్లు ఉండడంతో వాటిని తొలగించవద్దని సేవ్ బనియన్స్ స్వచ్ఛంద సంస్థకు చెందిన వ్యక్తులు ఎన్జీటీలో కేసు వేయడంతో పనులు ముందుకు సాగలేదు.
బైపాసులు, రోడ్డు సెంట్రల్ మీడియన్ ను తగ్గించడం ద్వారా 393 కాపాడుతామని, 522 చెట్లు ట్రాన్స్ లొకేట్ చేస్తామని ఎన్ హెచ్ ఏఐ అధికారులు ఎన్జీటీకి విన్నవించినా ఒప్పుకోలేదు. కేసులో ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు మార్చి 25న పనులపై స్టే విధిస్తూ తీర్పు ఇచ్చింది. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేశించాలని, ఈఐఏ (ఎన్విరాన్ మెంట్ ఇంపాక్ట్ అసెస్ మెంట్) జడ్ ఎస్ ఐ(జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) రిపోర్టు సబ్మిట్ చేయాలని ఆదేశించింది.
పర్యావరణ వేత్తలతో చర్చలు సఫలం
సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సొంత నియోజకవర్గాలకు వెళ్లే రోడ్డు ఇదే కావడం, మరో వైపు ఈ దారిలో నిత్యం ప్రమాదాలు జరుగుతుండడంతో ఈ సమస్యను సీరియస్ గా తీసుకున్నారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్ హెచ్ ఏఐ అధికారుల సమక్షంలో ‘సేవ్ బనియన్స్’ సంస్థకు చెందిన పర్యావరణ వేత్తలతో పలుమార్లు చర్చలు జరిపారు.
765 చెట్లు కాపాడుతామని, 150 చెట్లు మాత్రమే రీ లొకేట్ చేస్తామని హామీ ఇవ్వడంతో వాళ్లు కేసు విత్ డ్రా చేసేందుకు అంగీకరించారు. ఈ మేరకు అలైన్ మెంట్ లో మార్పులకు సంబంధించిన పూర్తి స్థాయి రిపోర్టును ఎన్జీటీకి సమర్పించారు. ఈ రోడ్డును రెండు వైపులా కలిపి 60 మీటర్లకు విస్తరించాల్సి ఉండగా..సెంట్రల్ మీడియన్ స్థలాన్ని 5 మీటర్లుగా నిర్ణయించారు. ప్రస్తుతం డిజైన్ మార్చి తొలుత 5 మీటర్లుగా ప్రతిపాదించిన సెంట్రల్ మీడియన్ ను ఇప్పుడు 1.5 మీటర్లకు తగ్గించారు. ఈ మూడున్నర మీటర్ల భాగాన్ని ప్రధాన కలిపి వృక్షాలకు చేరువ వరకు రోడ్డును విస్తరిస్తారు.
వృక్షాల ఆవల మరో వైపు రోడ్డు నిర్మిస్తారు. అంటే ప్రధాన రోడ్డుకు మధ్యలో వృక్షాలుంటాయి. వాహనాలకు ఇబ్బందిగా మారే కొమ్మలను తొలగిస్తారు. 150 వృ క్షాలు మాత్రం ఈ డిజైన్ కు అనుకూలంగా లేకపోవడంతో వాటని వేర్లతో సహా తొలగించి శాస్త్రీయ పద్ధతిలో పక్కన నాటుతారు. ఈ వృక్షాలకు ఇప్పటికే రెడ్ మార్క్ వేశారు. రీ డిజైన్ ద్వారా చెట్లు సేఫ్ అవడమే కాదు..రోడ్డు వంకరలు లేకుండా సుగమంగా మారనుంది.
త్వరలోనే రోడ్డు పనులు ప్రారంభం
అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46 కి.మీ. రోడ్డు పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే మొయినాబాద్, చేవెళ్ల వద్ద బైపాస్ పనులు ఇప్పటికే ప్రారంభయ్యాయి. ఈ రోడ్డు పూర్తయితే పశ్చిమ రంగారెడ్డితో పాటు వికారాబాద్ జిల్లా ప్రజలు ఇబ్బందులు తీరనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి చేవెళ్ల ప్రజల తరఫున ధన్యవాదాలు.
- ఆగిరెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు