28-11-2025 12:00:00 AM
హైదరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తొలి దశలో 4,236 గ్రామాలు, 37,450 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటికి సంబంధించి నామినేషన్ల దాఖలుకు అధికారులు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశారు. గురువారం నుంచి ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు.
31 జిల్లాల్లో కలిపి తొలి రోజు మొత్తం 408 సర్పంచ్ స్థానాలకు, 374 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖ లైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన, డిసెంబర్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు.
అదే రోజున బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించి వారికి ఎన్నికల గుర్తును కేటాయిస్తారు. డిసెంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజున మధ్యాహ్నం 2 గంటల నుం చి ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు.
ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు
సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్లపై పలువురు కోర్టును ఆశ్రయిస్తున్న నేపథ్యంలో రాష్ర్ట ప్రభు త్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్‌లో ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేసింది. సూపరింటెండెంట్ స్థాయి అధికారులు కిషన్ సింగ్, మాధురిలత, క్రాంతికిరణ్‌తో లీగల్ సెల్ ఏర్పా టు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ జీ. శ్రీజన గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలు నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తిచేసే విధంగా, ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా వెంటనే చర్యలు తీసుకునేలా లీగల్ సెల్ జిల్లాలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.
ఏకగ్రీవాలపై స్పెషల్ ఫోకస్
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం స్పెషల్ ఫోకస్ పెట్టింది. వేలం ద్వారా, బలవంతంగా సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు జరిగే ఏకగ్రీవాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాల వేలంపై ప్రత్యేక పర్యవేక్షణ విభాగం ఏర్పాటు చేసింది. జనాభా ఆధారంగా రెండు గ్రామ పంచాయతీలకు కలిపి ఒక రిటర్నింగ్ అధికారిని నియమించారు.
21 ఏండ్ల వయస్సు ఉన్న వారు, అదే గ్రామంలో ఓటరుగా నమోదైన వారు సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసేందుకు అర్హులు. సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసేవారు (జనరల్) రూ.2వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ. వెయ్యి డిపాజిట్ కింద చెల్లించాలి. వార్డు సభ్యులుగా పోటీ చేసే వారు (జనరల్) రూ.500, ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.250 డిపాజిట్ చెల్లించాలి.
అందుబాటులో టీ-పోల్ యాప్
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పౌరు లు తమ పోలింగ్ స్టేషన్, ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్ చేసుకునేందుకు, ఫిర్యాదులను అప్ లోడ్ చేసి, వాటి పరిష్కార ప్రగతిని ట్రాక్ చేసుకునేందుకు ఎన్నికల సంఘం టీ- పోల్ పేరిట ఒక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్‌ను ప్లే స్టోర్ లో ఉందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.
పలు గ్రామాలు ఏకగ్రీవం
గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ మొదటి రోజే గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం చింతకుంట, గద్వాల మండలం కొండపల్లి, గట్టు మండలం గొర్ల ఖాన్‌దొడ్డి, నిర్మల్ జిల్లా మామడ మండలంలోని వాస్తాపూర్ గ్రామాల్లో సర్పంచులను ఓటర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.