calender_icon.png 26 September, 2025 | 10:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్ బాదావత్ సంతోష్

26-09-2025 07:23:13 PM

నాగర్‌కర్నూల్,(విజయక్రాంతి): జిల్లాలో జరగబోయే ఎంపీటీసీ, జడ్పిటీసీ ఎన్నికలను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని విధాలుగా సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులు, ఆర్‌వోలు, ఏఆర్‌వోలకు ఎన్నికల తొలి దశ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు దేవ సహాయం, అమరేందర్, డిప్యూసీఓ గోపాల్ నాయక్, డిపిఓ శ్రీరాములు తదితర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలు, నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్ పత్రాలతో జరుగుతున్నందున అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పక్కాగా చేసుకోవాలని తెలిపారు. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే మండల ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి, సమయపాలనతో నామినేషన్ల ప్రక్రియను నిర్వహించాలని ఆదేశించారు.

నామినేషన్ గదిలో గోడ గడియారం తప్పనిసరిగా ఉండాలని, నిబంధనల ప్రకారం నడిస్తే పోలింగ్, కౌంటింగ్ సజావుగా సాగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిటర్నింగ్‌ అధికారులే కీలక పాత్ర పోషిస్తారని, వారు ఎలాంటి స్వతంత్ర నిర్ణయాలు తీసుకోకుండా పూర్తిగా ఎన్నికల నిబంధనల ప్రకారమే వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

నామినేషన్ల పరిశీలన, గుర్తుల కేటాయింపు వంటి అంశాల్లో అత్యంత జాగ్రత్త అవసరమని సూచించారు. పారదర్శకతతో, సమయపాలనతో పనిచేస్తే ఎన్నికల నిర్వహణ విజయవంతం అవుతుందని కలెక్టర్ అన్నారు. మండల కేంద్రాల్లో అభ్యర్థులకు నామినేషన్ పత్రాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. అనంతరం కలెక్టర్ ఎన్నికల మాస్టర్ ట్రైనర్స్ అందించిన శిక్షణ తరగతులను పరిశీలించారు.