calender_icon.png 24 July, 2025 | 8:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారులు పాఠశాలలను సందర్శించాలి

23-07-2025 07:52:40 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): అధికారులు తమ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలలో ప్రతిరోజు ఒక పాఠశాలను సందర్శించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే(District Collector Venkatesh Dhotre) అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి జిల్లాలోని అన్ని మండలాల మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో వసతి గృహాల సందర్శన, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల వేగవంతం, వన మహోత్సవం-2025 లక్ష్యాల సాధన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం క్రింద ఇండ్ల లబ్ధిదారుల ధ్రువపత్రాల సర్వే, ప్రధానమంత్రి జన్ మన్ పథకం క్రింద పివిటిజిలకు ఇండ్ల మంజూరు, సీజనల్ వ్యాధుల నియంత్రణ, గ్రామపంచాయతీలలో పారిశుధ్య నిర్వహణ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మండలాలలో గల ప్రభుత్వ విద్యా సంస్థలకు అధికారులు తమకు కేటాయించిన పాఠశాలలలో ప్రతిరోజు ఒక పాఠశాలను సందర్శించి విద్యార్థులకు ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం మెనూ ప్రకారం అందించేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, నాణ్యమైన విద్య అందించే విధంగా ఉపాధ్యాయుల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యాసంస్థలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు శుద్ధమైన త్రాగునీటిని అందించాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులు ఈ నెల చివరి వరకు 100 శాతం పనులు ప్రారంభించే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం క్రింద మంజూరైన ఇండ్లను సర్వే నిర్వహించి వివరాలను సంబంధిత పోర్టల్ లో నమోదు చేయాలని, ప్రధానమంత్రి జన్ మన్ పథకం కింద పి.వి.టి.జి. లకు మంజూరైన జిల్లా వివరాలను సర్వే నిర్వహించి ఆధార్ ధర ధృవపత్రాలను పోర్టల్ లో నమోదు చేయాలని తెలిపారు. గ్రామాలలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, డెంగ్యూ, చికెన్ గున్యా ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నివారణ చర్యలు చేపట్టాలని, దోమల బుద్ధిని అరికట్టేందుకు ఆయిల్ బాల్స్, బ్లీచింగ్ పౌడర్ పిచికారి చేయాలని, నీటి నిల్వలు లేకుండా ఎప్పటికప్పుడు తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గర్భిణులను ప్రసవం కొరకు సురక్షిత ప్రాంతాలకు తరలించి సుఖ ప్రసవం జరిగేలా వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలని తెలిపారు.

భారీ వర్షాల దృష్ట్యా ప్రజలను అప్రమత్తం చేయాలని, లోతట్టు ప్రాంతాలు, వరద ప్రభావిత ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు స్థలాలను గుర్తించాలని తెలిపారు. వనమహోత్సవం క్రింద జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని ఆగస్టు 15వ తేదీలోగా పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి లక్ష్మీనారాయణ, హౌసింగ్ పి. డి. వేణుగోపాల్, డివిజనల్ పంచాయతీ అధికారి ఉమర్ హుస్సేన్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.