28-07-2025 02:39:12 PM
- 18 ఏండ్ల తర్వాత జులై నెలలో ప్రాజెక్టుకు వరద రేపు నాగార్జునసాగర్ గేట్లు ఓపెన్.
- శ్రీశైలం ప్రాజెక్టు 3 క్రస్ట్ గేట్ల నుంచి సాగర్ కు పరుగులు తీస్తున్న కృష్ణమ్మ
నాగార్జునసాగర్,(విజయక్రాంతి): శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో మరో గేటును ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మూడు గేట్ల ద్వారా నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలంలో 1,69,044 క్యూసెక్కులు చేరుతోంది. శ్రీశైలం నుంచి ఔట్ ఫ్లో 1,67,195 క్యూసెక్కులు. మూడు స్పిల్ వే గేట్ల ద్వారా 80,764 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 20,000 క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 31,096 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.50 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 202.04 టీఎంసీలుగా కొనసాగుతోంది.
శ్రీశైలం నుంచి సాగర్ కు పరుగులు తీస్తున్న కృష్ణమ్మ
నాగార్జున సాగర్ జలాశయానికి వరద ఉధృతి రోజురోజుకూ పెరుగుతోంది.ఆల్మట్టి నుంచి శ్రీశైలం దాకా అన్ని ప్రాజెక్టులను నిండుగా నింపిన కృష్ణమ్మ, నాగార్జునసాగర్‌కూ పూర్తి జలకళ తెచ్చేసింది. ప్రాజెక్టు దాదాపుగా నిండిపోయింది. సాగర్ జలకళను సంతరించుకున్నాయి. క్రమంగా నీటి మట్టాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రేపు ఉదయం 8 గంటలకు నాగార్జున సాగర్ గేట్లు తెరవాలని అధికారులు నిర్ణయించారు.
ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం రేపు ఉదయానికి చేరుకోనుంది. అందుకే రేపే గేట్లను పైకెత్తి నీటిని దిగువకు వదలాలని అధికారులు నిర్ణయించారు. కాగా ఇవాళ సాయంత్రం 6 గంటలకే ప్రాజెక్టు నీటిమట్టం 586 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి భారీగా వరద ప్రవాహం వస్తుండడంతో రేపు ఉదయానికి పూర్తి స్థాయిలో నిండనుంది. నాగార్జునసాగర్ గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులకు ప్రస్తుతం 584 అడుగులకు నీరు చేరింది. టీఎంసీల పరంగా చూస్తే.. 312 టీఎంసీల సామర్థ్యానికి గాను ప్రస్తుతం 295 టీఎంసీల నీరు ఉంది.
రేపటికి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటుందని.. రేపు జలాశయం గేట్లు ఎత్తేందుకు మంగళవారం ముహూర్తం ఫిక్స్ చేసిన అధికారులు సాగర్ క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీరు విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు ఇన్‌చార్జి ఎన్‌ఈ మల్లికార్జునరావు తెలిపారు. సాగర్ క్రస్ట్‌గేట్లను సాధారణంగా ఆగస్టు, సెప్టెంబరులో తెరుస్తారు. జూలైలో ఎత్తడం అరుదు. ఈసారి జూన్ 30 నుంచే ప్రాజెక్టుకు వరద మొదలైంది.
2007లో జూలైలో ప్రాజెక్టు గేట్లను ఎత్తగా 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ జూలైలో నీటిని దిగువకు వదలనున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 584 అడుగులుగా ఉంది. ప్రాజెక్టులో గరిష్ఠంగా 312.05 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. ఇప్పుడు 294 టీఎంసీల నీరు ఉన్నది. మరో 17 టీఎంసీల నీరు వస్తే నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరింది.