28-07-2025 08:19:40 PM
కలెక్టర్ ఆదర్శ్ సురభి..
వనపర్తి (విజయక్రాంతి): విద్యార్థులు, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(District Collector Adarsh Surabhi) ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల నిర్మూలనకు అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వనపర్తి జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం పై వార్తలు విన వస్తున్నాయని, యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా లైన్ డిపార్ట్మెంట్ లు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తద్వారా వనపర్తి జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చి దిద్దడమే లక్ష్యమని చెప్పారు. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నిర్మూలనకు పోలీసు, ఎక్సైజ్, ఔషధ తనిఖీ, విద్య, వైద్యశాఖలు, అటవీ శాఖ, వ్యవసాయ, రవాణాశాఖ అధికారులు సమన్వయంతో పని చేసి నిర్మూలనకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా కేంద్రంలోని అనుమానాస్పద ప్రాంతాల్లో పోలీసులు, అబ్కారీ శాఖ అధికారులు తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. అదేవిధంగా జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేసి మాదక ద్రవ్యాల రవాణాకు ఆస్కారం లేకుండా అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. మెడికల్ దుకాణాలలో వైద్యుల ప్రెస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మడానికి వీలు లేదని, అలా అమ్మితే చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఆర్ఎంపి డాక్టర్లు తాహతుకు మించి వైద్యం చేస్తున్నారని, అలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య అధికారిని ఆదేశించారు. అనంతరం మాదకద్రవ్యాల నిర్మూలనకు సంబంధించిన ప్రచార పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, జిల్లా అటవీ శాఖ అధికారి ఇంచార్జి అరవింద్ కుమార్ , ఆర్డీవో సుబ్రహ్మణ్యం, డ్రగ్ ఇన్స్పెక్టర్ రష్మీ, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.