21 August, 2026 | 7:00 AM

60 వేల టన్నులకు తగ్గిన కొనుగోళ్లు

23-05-2024 04:11 AM

ప్రైవేట్ వ్యాపారులకే మొగ్గు చూపుతున్న రైతులు

ప్రభుత్వ జాప్యమే కారణమంటున్న అన్నదాతలు

మరో 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకే అవకాశం

హైదరాబాద్, మే 22 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేయలేక ప్రభుత్వం చేతులెత్తేస్తోంది. దీంతో ఆగ్రహించిన అన్నదాతలు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి అమ్మకాలు చేస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వ జాప్యం.. మరోవైపు తొందరగా నగదు అందజేస్తుండటంతో పెద్ద సంఖ్యలో రైతులు ప్రైవేటు వ్యాపారుల వైపు మొగ్గు చూపారు. మంగళవారం 75 వేల టన్నులు కొనుగోలు చేయగా.. బుధవారం ఈ పరిమాణం మరింత తగ్గి 60 వేల టన్నులకు పడిపోయింది. దీంతో ప్రభుత్వం ఆశించిన విధంగా ధాన్యం లభించటం లేదు.

ఈ ఏడాదిలో సర్కార్ 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా ప్రస్తుతం 52 లక్షల మెట్రిక్ టన్నులకు మించి కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఇప్పటివరకు 38 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించారు. ఇంకా 15 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలుకు మాత్రమే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ధాన్యం దెబ్బతింటుందని భావించి సమీపంలోని ప్రైవేటు వ్యాపారులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు అమ్మకాలు చేశారు. వారం రోజుల పాటు ప్రభుత్వం కేంద్రాల్లో ధాన్యం సేకరణ నిలిపివేయడంతో మధ్య తరగతి రైతులు ఐకేపీ సెంటర్లలో రోజుల తరబడి కాపాలా ఉండలేమని ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించారు.

ప్రభుత్వ కేంద్రాలను నమ్ముకుంటే నష్టపోతామని భావించి రైతులు ముందుగానే అమ్మకాలు చేశారు. యాసంగి సీజన్‌లో ప్రైవేటు వ్యాపారులు 23 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గత మూడేళ్ల నుంచి ప్రభుత్వమే పెద్ద మొత్తంలో ధాన్యం సేకరణ చేయగా, ఈ ఏడాదిలో తక్కువగా కొనుగోలు చేసినట్లు తెలిసింది. పౌర సరఫరాల శాఖ ప్రారంభంలో రోజుకు లక్ష మెట్రిక్ టన్నులు సేకరణ చేయగా, రెండు రోజుల నుంచి సేకరణ పరిమాణం తగ్గుతూ వస్తోంది. జూన్ 10 వరకు పూర్తి ధాన్యం సేకరించాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకోగా.. మే 31 వరకే పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.

మిగిలిన ధాన్యం తక్కువే.. 

వరి ధాన్యం సేకరణ దాదాపు పూర్తి దిశకు చేరుకుందని, ఈ నెలాఖరులోగా 15 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించే అవకాశం కనిపిస్తుందని పౌర సరఫరా శాఖ అధికారులు చెప్పారు. ఇప్పటికే ధాన్యం ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేయడంతో 10 నుంచి 15లక్షల మెట్రిక్ టన్నుల వరకు మాత్రమే ఉన్నట్లు అంచనాకు వచ్చినట్లు వెల్లడించారు. చిన్నకారు రైతుల వద్ద ఉన్న తాము పూర్తిగా సేకరించామని, పెద్ద మొత్తంలో పండించే రైతులంతా ప్రైవేటు వ్యాపారులకే అమ్మకాలు చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కొనుగోలు చేసి వాటిలో తడిచినవి, మొలకెత్తిన ధాన్యం కూడా ఉన్నాయని, వాటిని కూడా పూర్తిగా తీసుకుంటామని వెల్లడించారు.