calender_icon.png 16 August, 2025 | 5:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంద్రాగస్టు నాడే పీవో పండంటి బిడ్డకు తండ్రి

16-08-2025 12:33:21 AM

సర్కార్ దవాఖానాలో ఐఏఎస్ సతీమణి ప్రసవం   

భద్రాచలం, ఆగస్టు 15 (విజయ క్రాంతి): నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్నది ఆనాటి ప్రభుత్వ ఆసుపత్రుల దైన్యస్థితిపై ఓ సినీ గేయ రచయిత రాసిన పాత పాట అది. నేడు ఈ పాటకు పదాలు మారాయి. స్వరం కూడా మారింది. సామాన్యుల నుంచి, ఐఏఎస్ ల వరకు ప్రభుత్వ దవాఖానాకు పయనం కడుతున్న రోజులు వచ్చేసాయి. ఇది పచ్చి నిజం. ఇందుకు సజీవ సాక్ష్యం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ఉదయం ఐటీడీఏ పీవో రాహుల్ సతీమణి మనీషా రాహుల్ పురుడు పోసుకుంది. కచ్చితంగా ఆగస్టు 15 రోజునే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. పిఓ రాహుల్ తండ్రి అయ్యారు. ఈ చూడాముచ్చటైన సంఘటన తెలుసు కోవాలంటే పూర్తి కథనం చదవాల్సిందే....

భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఏజెన్సీ ప్రాంతానికే పెద్దదిక్కు.ప్రసవాల విషయంలో ఆసుపత్రికి పెద్ద రికార్డే ఉంది. ఇది మూడు రాష్ట్రాల పేదోళ్ల పెద్ద ఆసుపత్రి. ఇక్కడ ప్రతిరోజు ఓపి పెద్ద సంఖ్యలోనే ఉంటుంది. ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పేదల నుంచి, పెద్దల వరకు కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నారు.

సర్కార్ దవాఖానాలో ఐఏఎస్ సతీమణి ప్రసవం

భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు ఆఫీసర్ బి రాహుల్ సతీమణి మనీషా రాహుల్ నిండు గర్భిణి. గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో పురిటి నొప్పులు రావడంతో ఆమెను హుటా హుటిన భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఫ్రీ డెలివరీ అవుతుందేమోనని వేచి చూశారు. కానీ అలా జరగకపోవడంతో ఆపరేషన్ చేయడంతో శుక్రవారం ఉదయం 3.16 నిమిషాలకు పండంటి మగ బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. పిఓ రాహుల్ తండ్రి అయ్యారు.

తల్లి, బిడ్డ క్షేమంగా ఉండటంతో అందరూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినప్పటికీ...బి.రాహుల్ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో తన సతీమణికి ప్రసవం జరిగేలా నిర్ణయం తీసుకున్నందుకు సర్వత్ర ఆశ్చర్య పడుతున్నారు. ప్రభుత్వ దవాఖానాలపై నమ్మకం కలిగేందుకు ఇటువంటి చర్య లు ఉపక్రమిస్తాయని పలువురు చర్చించుకుంటున్నారు.పంద్రాగస్టు నాడే పండంటి బిడ్డకు పీఓ తండ్రిఆగస్టు15 తెల్లవారుజామున, అందులోనూ శుక్రవారం, స్వాతంత్య్ర దినోత్సవం నాడే ఐటిడిఏ పిఓ పండంటి మగ బిడ్డకు తండ్రి అయ్యారు. పిఓ రాహుల్ అంటేనే ప్రతి విషయంలో ఒక స్పెషల్ ఉం టుంది. పేరు బలమో ఏమో కానీ అన్ని అంశాల్లో కూడా పిఓది ప్రత్యేక శైలి.

భద్రాచ లం ఐటిడిఏ పిఓగా ఏడాది పాలనను విజయవంతంగా పూర్తి చేశారు. విద్యలో తన దైన శైలిలో మార్పు చూపించారు. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు ఫీవో రాహుల్ సృష్టి ట్రైబల్ మ్యూజియం అద్దం పడుతోంది. వారి సతీమణి మనిషా కూడా ప్రభుత్వ ఉపాధ్యాయురాలే. వీరిది ప్రేమ వివాహం. పిఓ సతీమణి చక్కని పెయింటర్ కూడా.  వీరిద్దరిది అన్యోన్య దాంపత్యం. చూడ ముచ్చటైన ఈ జంట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం జరిగేలా నిర్ణయం తీసుకోవడం అందరి చేత ప్రసంశింప జేసింది. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.జితేష్ పాటిల్ సతీమణికి కూడా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం జరిగిన విషయం విధితమే.

భద్రాచలం ఐటీడీఏ పీవో బి రాహుల్ సతీమణి మనిషా రాహులకు ప్రసవంకు గైనిక్ డాక్టర్స్ డా. సాత్విక, డా. శంషాద్ మత్తు వైద్యురాలు డా.కౌం డిన్య, చిన్న పిల్లల వైద్య నిపుణులు డా. క్రాపా విజయ్,మిడ్ వైఫ్ విజయం శ్రీ, పుష్పలత హెడ్ సిస్టర్స్ రాజ్యలక్ష్మి, సునీత, కళ్యాణి, ఓ.టి అటెండెంట్స్‌నిర్మల, సుజాత, ఖాజా, శివఅదనపు వైద్యాధికారులు డా. సైదులు, డా. చైతన్య, భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రామకృష్ణ తదితరులు వైద్య సేవలు అందించారు. ఇదిలా ఉండగా పండంటి మగ బిడ్డ కు తండ్రి అయిన ఐటీడీపీఓ రాహుల్ ఐఏఎస్ కు ఐటీడీఏ ఏపీవో జనరల్ డేవిడ్ రాజు గారు, వివిధ యూనిట్ అధికారులు స్వీట్ తినిపించి ఆనందోత్సవాలు వ్యక్తం చేశారు.