16-08-2025 12:34:02 AM
రాష్ట్ర నీటిపారుదల పౌరసరపాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
సూర్యాపేట ఆగస్టు 15 (విజయక్రాంతి) : భావితరాలకు మంచి భవిష్యత్తును అందించడమే తమ లక్ష్యమని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జిల్లా గ్రంధాలయ కేంద్రంలో శుక్రవారం 1.5 కోట్ల రూపాయలతో నూతన భవన నిర్మాణ పనులకి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భావితరాలకు మంచి విద్యను అందించాలని సంకల్పంతో వారికి అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు అన్ని విధాలుగా సహకరిస్తానన్నారు.
దానిలో భాగంగానే జిల్లా గ్రంధాలయ సంస్థకి కోటిన్నర రూపాయలతో నూతన భవనం, కోటి రూపాయలతో మౌళిక వసతుల కల్పనకి ఇప్పటికే మంజూరు చేశానన్నారు. అదనంగా మరో కోటి రూపాయలను ఎస్ డి ఎఫ్ నిధుల నుండి మంజూరు చేస్తాననని, ఈ పనులు 6 నెలలో పూర్తి చేయాలన్నారు. అలాగే సమాజంలో మార్పు కొరకు పేద గిరిజన విద్యార్థుల కొరకు సైదా నాయక్ నిర్వహించే గ్రంధాలయంకి 10 లక్షల రూపాయలు మంజూరు చేసారు.
జిల్లాలోని పెన్ పహాడ్, తుంగతుర్తి, మోతె, గరిడేపల్లి గ్రంధాలయాల నిర్మాణానికి, కోదాడ, హుజూర్ నగర్ లో అదనపు గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు తీసుకొని వస్తే రేపు సాయంత్రం లోపు మంజూరు చేస్తానన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు ఏమి కావాలన్నా వ్యక్తిగతంగా సహాయం చేస్తానని, విద్యార్థులు ఆహ్లాదకర వాతావరణంలో మంచిగా చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలన్నారు..
రాత్రిపూట గ్రంథాలయాలు ఎక్కువ సేపు పని చేసేలా అదనంగా అవుట్ సోర్సింగ్ సిబ్బంది ని నియమించుకునేందుకు నిధులు మంజూరు చేస్తానన్నారు. అలాగే 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ఓ మంచి పనికి శ్రీకారం చుడుతున్నానని తనని కలవటానికి వచ్చే ప్రజాప్రతినిధులు పూల బొకేలు, శాలువాలు తేకుండా వాటిక ఏ ఖర్చును నగదు రూపంలో జిల్లా గ్రంధాలయ సంస్థకి ఇవ్వాలన్నారు.
తదుపరి కోదాడ శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకి మంచి భవిష్యత్తును అందించేందుకు తనవంతుగా తాను చదువుకున్న ఆర్కిటెక్చర్ సబ్జెక్ట్ ను ఊయోగించి ఆదర్శమైన గ్రంధాలయం నిర్మాణానికి డిజైన్ చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, అగ్రికల్చర్ కమిషన్ మెంబర్ చేవిటి వెంకన్న యాదవ్, ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి, గ్రంధాలయాల సెక్రటరీ బాలమ్మ, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.