13-11-2025 09:48:13 PM
షాపింగ్ కాంప్లెక్స్ స్లాబ్ పనుల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
రామగుండం (విజయక్రాంతి): గోదావరిఖని నగర అభివృద్ధి దిశగా ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టిందని ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ అన్నారు. గురువారం చౌరస్తా లో నూతనంగా నిర్మాణం జరుగుతున్న షాపింగ్ కాంప్లెక్స్ స్లాబ్ పనులను ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, గోదావరిఖనిలో నూతనంగా నిర్మాణం అవుతున్న ఈ షాపింగ్ కాంప్లెక్స్ పూర్తయిన తర్వాత ప్రజలకు వాణిజ్య సౌకర్యాలు మరింతగా అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అంతేకాకుండా, స్థానిక వ్యాపారులకు, చిన్న వ్యాపారస్తులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడేలా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నగర ఆధునీకరణలో ఈ ప్రాజెక్ట్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.