12-10-2025 02:02:20 AM
హైదరాబాద్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): హిందువుల పట్ల దేశంలో వివక్ష కొనసాగుతున్నదని, రాజ్యాంగ సంస్కరణలతోనే అది అంతం అవుతుందని సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ అరవిందరావు, ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు. శనివారం ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‌లో ‘రాజ్యాంగ పక్షపాతం హిందువులకు సమాన హక్కుల నిరాకరణ’ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ..
హిందువులు ప్రత్యేక హక్కులను కోరుకోవడం లేదు, కేవలం సమానత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. అందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 నుంచి 30 వరకు ఈ నిబంధనలు ముస్లిములకు, క్రైస్తవులకు అనుకూలంగా ఉన్నా యని, వీటిలో సవరణలు చేయాలని కోరా రు.- వాణిజ్యపరంగా దోపిడీకి గురవుతున్న, జనాభాపరం గా క్షీణిస్తున్న హిందువులను మేల్కొపాలని పిలుపునిచ్చారు.
‘ఈ ఆర్టికల్స్ కారణంగా విద్యా రంగంలో హిందువులకు పెద్ద అన్యా యం జరుగుతోందని, హిందువులకు మతం ఆధారిత బోధనకు అనుమతి ఉండదని తెలిపారు. కానీ మైనారిటీలు విద్యా సంస్థలను స్థాపించడానికి ప్రత్యేక హక్కులను పొందుతారని, ఈ అసమతుల్యత హిందువులను వారి స్వంత గ్రంథాల గురిం చి తెలుసుకోకుండా అజ్ఞానంలో ఉంచుతుందని వాదించారు. హిందూ ధర్మాన్ని పాఠశాల పాఠ్యాంశాల్లో చేర్చాలని పిలుపునిచ్చారు. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడు కోవడానికి విద్యార్థులకు హిందూ ధర్మం గురించి బోధించాలని కోరారు.
70 శాతానికి పడిపోయిన హిందువుల జనాభా
దేశంలో మతమార్పిడులు హిందూ జనాభాను క్షీణింపజేస్తున్నాయని హెచ్చరించారు. 1950లో 84 శాతం నుంచి ప్రస్తుతం 70 శాతానికి హిందు జనాభా పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇది ఇలాగే కొనసాగితే, 2040 నాటికి హిందూ ప్రధానమంత్రి కావడం కష్టమని పేర్కొన్నారు. హిందువులందరూ మేల్కొని హిందూ మతాన్ని రక్షించుకోవాలన్నారు. ఆలయాల నిర్వహణలో హిందూ దేవాలయాలపై వివక్ష ఉన్నదన్నారు.
దేశవ్యాప్తంగా 2 లక్షలకు పైగా హిందూ దేవాలయాలు ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటే.. ఒక్క మసీదు, చర్చి కూడా ప్రభుత్వ నియంత్రణలో ఎందుకు లేదని ప్రశ్నించారు. ప్రభుత్వాలు హిందూ దేవాలయాలు, ఆస్తులు, భూములను ఆదాయ వనరులుగానే చూస్తాయని ఆరోపించారు. ప్రభుత్వాలు తమిళనాడులో 25 లక్షల ఎకరాల దేవాలయ భూములను, ఏపీలో 15 లక్షల ఎకరాలను స్వాధీనం చేసుకున్నాయని వివరించారు.
వాటిని పరిహారం లేకుండా సంక్షేమం కోసం ఉపయోగిస్తున్నాయని తెలిపారు. అన్ని దేవాలయాలను ప్రభుత్వ ఆధీనం నుంచి విడిపించి హిందువులకు అప్పగించడానికి కొత్త ఆలయ చట్టాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. హిందూ ఆలయాల ఆదాయాన్ని హిందూ ధర్మం, దాని రక్షణ కోసం ఉపయోగించాలని కోరారు.-