12-10-2025 12:41:43 AM
మంథని అని పిలుస్తున్న మంత్రకూటనగరం ఒకప్పుడు ప్రముఖమైన విద్యాపీఠం. ‘వింధ్యాద్రి దక్షిణప్రాంతే విలసద్గౌతమీతటే’ (వింధ్యపర్వతాలకు దక్షిణ ప్రాంతంలో విలసితమైన గౌతమీ(గోదావరి) నదీతీరంలో ఉన్నది మంత్రకూటం. దేశమంత టిలో కీర్తిగాంచిన వేదపండితులిక్కడ వుండేవారని, మంత్రకూటం వేదపీఠంగా ప్రఖ్యాతమైనదని తెలుస్తున్నది.
గోదావరి(గౌతమి)నది ఒడ్డున వెలసిన మంత్రకూటం బ్రహ్మపురాణంలో పేర్కొనబడ్డట్లు ‘మన్యుతీర్థం’గా పేరుగాంచింది. రాక్షసులబాధ పడలేక పారిపోయివచ్చిన దేవతలు మంత్రకూటంలో గౌతమేశ్వరునిగా క్షేత్రమూర్తిగావున్న ఈశ్వరుణ్ణి శరణు కోరినారట. గౌతమేశ్వరుడు తననుంచి మన్యువును పుట్టించాడట. ఆ మన్యువు రుద్రసమానుడు రాక్షసులను సంహరించాడట. అందువల్ల ఈ మంథనికి మంత్రకూటమనే పేరేకాక మన్యు/మనుపురంగా పిలువబడ్డదని చరిత్ర.
స్కాందపురాణాంతర్గతమైన కాళేశ్వరఖండంలో మంత్రకూట ప్రస్తావన, ప్రశస్తులున్నాయి.
కుండస్య పశ్చిమే భాగే
యోజనత్రితయాంతరే
మంత్రకూట ఇతి ఖ్యాతో
మునీనామాశ్రమో మహాన్
తపోధన నివాసత్వా త్సర్వర్తుభి రలంకతః
తత్రోద్భవాద్ద్విజన్మానో
భవేయుర్వేదపారగాః
మనీనా మత్రకూటత్వాత్ మంత్రకూట ఇతి శ్రుతః’ (కాళేశ్వరఖండం-తతీ యాధ్యాయం)
(తాత్పర్యం: యమకుండం(విశ్వకర్మ నిర్మితం) పడుమట మూడు యోజనాల దూరంలో మంత్రవేత్తలైన మునులకు ఆవాసం కావడం వల్ల మంత్రనగరిగా పేరుపొందిన మంత్రకూటం వెలసింది. తపోధనుల కారణంగా అన్ని రుతువులు ఇక్కడ వుంటాయి. ఇక్కడ పుట్టిన బ్రాహ్మణులు వేదపండితులౌతారు.
కాళేశ్వరఖండంలోనే గౌతమమహర్షి కూడా ఇక్కడ వుందని చెప్పబడ్డది. మంత్రకూటంలోవున్న గౌతమేశ్వరాలయంలోని ఈశ్వరుణ్ణి గౌతమమహర్షి ప్రతిష్ఠించడం చేత ఈ గుడికి గౌతమేశ్వరాలయం అని కలిగింది.
చారిత్రకంగా 10వ శతాబ్దం వరకు మంత్రకూట చరిత్ర బయటపడలేదు. ఈ కాలంలో పశ్చిమ (కళ్యాణి) చాళుక్య చక్రవర్తి త్రిభువనమల్లుని రాజప్రతినిధిగా గుండరాజు మంత్రకూటం రాజధానిగా ఈ ప్రాంతాన్ని పాలించినాడు.
మంథనికి దక్షిణంగా గ్రామాన్నానుకుని పారే బొక్కలవాగులో గుండ రాజు వేయించిన శాసనమొకటి దొరికింది. రామప్పగుడి శాసనంలో కూడా గుండరాజు ప్రస్తావన వుంది. ఇతనినే కాకతీ 2వప్రోలరాజు చంపివేసినట్లు శాసనాధారం లభిస్తున్నది.
రుద్రదేవుని అనుమకొండ శాసనం:
“కద్దేనోద్దుర మంత్రకూట నగరీనాథోధయోనిస్త్రపో
గుండః ఖండిత ఏవ ముండిత శిరః క్రోడాంక వక్షఃస్థలః
ఏడో డింబకవత్సాయనపరో జాతో గతః స్వాంపురీ
మాహూతోపి నపేశ్వరస్య పురతః ప్రోలేన యుద్ధాయతత్”
గుండరాజు మరణాంతరం ప్రోలరాజు మొదలు ప్రతాపరుద్రుని వరకు ఈ ప్రాంతం కాకతీయుల ఏలుబడిలోనికి వెళ్లిపోయింది.
రుద్రమదేవి దేవగిరి రాజు మహాదేవుణ్ణి తరుముతూ మంత్రకూటం సమీపంలోనే పాదాక్రాంతుణ్ణి చేసుకున్నట్లు చెప్తారు. ఇక్కడ నదిలో రుద్రపాదాలు అనేచోట రాతిగుండ్ల మీద వీరులప్రతిమలు, ఏనుగులు, గుర్రాలు వంటి యుద్ధచిహ్నాలు చెక్కబడివున్నాయి.
కాకతీ ప్రతాపరుద్రదేవుడు మంత్రకూటాన్ని గోపాలస్వామి అనే బ్రాహ్మణునికి మళ్లీ అగ్రహారంగా దానమిచ్చాడట. ప్రతాపరుద్రునిగురువు మల్లికార్జునసూరి మంత్రకూట వాసియే. ప్రతాపరుద్రుని తండ్రికి అతనిబదులుగా మల్లికార్జునసూరి, తనభార్యతో గయ, కాశీలో శ్రాద్ధకర్మలను జరిపించాడని ప్రతాపరుద్రుని ‘గయా శాసనం’ (డీసీ సర్కారు పరిశోధన) తెలియజేస్తున్నది. గయాశాసనానికి సంబంధించిన శాసనం మంథని తమ్మచెరువుకట్ట కింద ఆంజనేయస్వామిగుడిలో వుంది. ఈ రెండు శాసనాలలో ‘మంత్రకూట గోపీజన వల్లభాయ నమః’ అని సమానంగా వుంది. దీనినిబట్టి గోపాలకష్ణుని గుడి మంథనిలో వుండేదని చెప్పవచ్చు.
రామగిరిపట్టణం రాజధానిగా ముప్పభూపాలుడు పాలించినట్లు మడికి సింగనామాత్య ‘పద్మపురాణోత్తర ఖండం’లో రాసాడు. ముప్ప భూపాలుని మంత్రి కందనామాత్యునికే మడికి సింగన తన పద్మపురాణోత్తరఖండం అంకితమిచ్చాడు. కాకతీయుల పిదప ఈ ప్రాంతాన్ని వెలమలు పాలించిన ఆధారాలు లభించాయి.
కులీకుతుబ్ షా 1498లో ఈ ప్రాంతాన్ని బహమనీపాలకులకప్పగించాడు. కుతుబ్షాహీల శాసన మొకటి రామగిరికోట 2వ ద్వారం మీద వుంది. అబ్దుల్లా కుతుబ్షా తన 2వ కూతురిని ఔరంగజేబు కొడుకు ముఆజంకు ఇచ్చి రామగిరి పరగణాను కట్నంగా ఇచ్చాడు.1676లో ఔరంగజేబు గోల్కొండ మీద దాడిచేసినపుడు రామగిరిని సైనికకేంద్రంగా చేసుకున్నాడు.ఆ సమయంలో మంథనికి దగ్గరిలోని కూచిరాజుపల్లె(బోయినిపేట) గ్రామాన్ని ఆ ఊరి బెస్తలకే జాగీరుగా ఇచ్చాడట.
ఒకసారి ఔరంగజేబు పల్లకీలో కూర్చొని, కొద్ది పరివారంతోడురాగా ప్రయాణం చేస్తున్నపుడు దారిలో తనకు బాగా ఆకలి వేసిందట. వెంట భోజనం లేని కారణంగా పల్లకిమోస్తున్న బెస్తలను వారి ఆహారాన్ని తనకిమ్మని అడిగాడట. ఆ ఢిల్లీ పాదుషా వారిచ్చిన అంబలిని కడుపారా తాగి, ఆకలి తీర్చుకున్నాడట. వారు తన ఆకలి తీర్చినందుకు వారికి కూచిరాజుపల్లెను స్వయంగా రాసి సనదులిచ్చినాడట. ఈ సనదులు మంథని బెస్తలవద్ద ఉన్నాయంటారు.
1798లో మంత్రకూట నివాసి బ్రాహ్మణుడు కర్దలా సమరం తర్వా నానాఫడ్నవీసుతో పట్టబడ్డ హైదరాబాద్ మంత్రి ఆరస్తుజాను జైలునుంచి విడిపించినాడట. అందుకు అతడు ఆ బ్రాహ్మణుని మానేరు ఒడ్డునవున్న అడవిసోమనపల్లె గ్రామాన్ని జాగీరుగా ఇచ్చాడు.
ఆ తర్వాత మంత్రకూటప్రాంతం వెలిగందల జిల్లా కేంద్రంగా హైద్రాబాద్ నిజాం నవాబుల పాలనలోనికి వచ్చింది. సాలార్జంగుహయాంలో జిల్లాల పునర్విభజన సమయంలో వెలిగందల జిల్లాకేంద్రం కరీంనగరుకు మార్చబడ్డది. తాలూకా కేంద్రం ఆరాంగీరు నుంచి మహదేవపురానికి, తర్వాత మంథనికి 1920లో మార్చబడింది.
మంత్రకూట ప్రాంతం:
ఈ ప్రాంతమంతటా పురాతన పట్టణాలు, వివిధ మతాలు, సంస్కతులు వెల్లివిరిసిన జాడలు కనిపిస్తాయి. ఈ ప్రదేశంలో వైదిక మతమే కాదు జైనమతం బలంగా వున్నట్లు నిదర్శనాలున్నాయి. మంథని పరిసరాల్లో, పరిసర గ్రామాల్లో జైనులుండిన గుహలు, జైన శిల్పాల చారిత్రక అవశేషాలుగుపిస్తుంటాయి. మంత్రకూటంలో భిక్షేశ్వరస్వామి గుడి బయట జైనశిల్పాలు, బల్లేర హనుమంతుని గుడి పరిసరాల్లో జైనుల బావులు, కొండమీద అంబగుళ్ళు అనే జైన గుహాలయాలు జైనమతం ఆనవాళ్లు. బౌద్ధమతం జాడలున్నా ఎక్కువ ఆధారాలు లభించలేదు.
కాకతీయులు ఇక్కడ అనేక శివాలయాలను కట్టించారు. శివలింగ ప్రతిష్ఠలు చేశారు. చంద్రవల్లి శివాలయం, గౌతమేశ్వరాలయాలు, మంథనిలో శీలేశ్వర, సిద్ధేశ్వర, భిక్షేశ్వరాలయాలు కాకతీయుల నిర్మాణాలే. అష్టదిశాలయంలో అష్టలింగాలున్నాయి. మయవాస్తుశాస్త్ర ప్రకారం పరమశాయిక పథకంపై కట్టిన శివక్షేత్రం.
శైవమతం తర్వాత ఇక్కడ వ్యాప్తిచెందిన మతం వైష్ణవం. ఇక్కడ వైష్ణవాలయాలను చూడగలం.
ఇక్కడ పూర్వమున్న పండితులు చతుర్వేదాలు, జ్యోతిష, తర్క, యోగ, మంత్ర, లౌకిక శాస్త్రాలలో, సంస్కతం, ఆంధ్రభాషల్లో ఆరితేరినవారు.
మంత్రకూటం పరిసరాల్లో రామగిరి, చంద్రవల్లి, కాశీపేట, నైనగుళ్లు, బహుగుళ్లు ప్రఖ్యాత చారిత్రక ప్రదేశాలు.
రామగిరి రాజధానిగా ముప్పభూపాలుడు పాలించినట్లు చరిత్ర. రామగిరి వైష్ణవాలయం వున్నట్లు మడికి సింగన తన కావ్యం పద్మపురాణోత్తరఖండంలో రాసాడు. రామగిరి మీద కోట, కోటకు సప్త(7)ప్రాకారాలు, కోట బురుజులు, కోట ద్వారాలు శిథిలాలై అగుపిస్తుంటాయి. రామగిరి మీద పాతనగరం ఆనవాళ్లు, కోనేరులు, సవాలక్షగాదెలనబడే ఆగారాలు, చెరువు వున్నాయి. కుండపెంకులు, గాజుపూసలు, నాణాలు ఈ పరిసరాల్లో లభించేవని ప్రజలు చెప్పుతుంటారు. రామగిరికి సమీపంలో బెల్లం రామయ్య మెట్టలు అను గుట్టలలో కొండరాళ్ల మధ్య గుహ వుంది. దీంట్లో రామపట్టాభిషేకం చెక్కబడివుంది. ఇంకా లోపల శివలింగం, అక్కడొక జలపాతం వున్నాయి. రామగిరి వనమూలికలకు, విలువైన రాళ్లకు పేరుగాంచింది.
ఆధారం: బి.వెంకటరామారావు మంత్రకూట చరిత్ర నుంచి అనుమతించిన విషయాలు వ్యాసంగా రాసిన ముప్పిడి రవీంద్రారెడ్డి రచనను (ఆంధ్ర
పత్రిక ఉగాది-1968 సంచిక) అనుసరించి