calender_icon.png 10 July, 2025 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూతపడిన పరిశ్రమలు తెరవండి

10-07-2025 12:12:37 AM

  1. సీసీఐ, ఎస్‌ఐఐఎల్ పునరుద్ధరణతో యువతకు ఉపాధి 
  2. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధి 
  3. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామికి మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి

హైదరాబాద్, జూలై 9 (విజయక్రాంతి): తెలంగాణలో మూతపడిన రెండు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల పునరుద్ధరణకు చొరవ చూపాలని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామిని రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. బుధవారం ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి మంత్రి శ్రీధర్‌బాబు ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ..సిమెంట్ కార్పొరేషన్ ఇండియా(సీసీఐ), స్పాంజ్ ఐరన్ ఇండి యా లిమిటెడ్(ఎస్‌ఐఐఎల్) పునరుద్ధరణ ప్రాధాన్యాన్ని కేంద్రమంత్రికి వివరించారు. గతంలో పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ పునరుద్ధరణ ను రూ.5 వేల కోట్లతో చేపట్టిన విషయాన్ని ప్రస్తావించారు.

ఆదిలాబాద్‌లోని సీసీఐ, భద్రాద్రిలోని ఎస్‌ఐఐఎల్ మూతపడటానికి దారితీసి న పరిస్థితులు, పరిశ్రమల పునరుద్ధరణతో యువతకు ఉపాధి అవకాశాల మెరుగుదల, ఆర్థికాభివృద్ధి తదితర అంశాలను కేంద్రమంత్రికి వివరించారు. వెనుకబడిన నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈ పరిశ్రమల పునరుద్ధరణతో ప్రాంతీయాభివృద్ధిలో సమతుల్యత సాధ్యమై రాష్ట్రం, దేశం ప్రగతి బాటలో పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సమగ్ర వివరాలతో కూడిన లేఖను కేంద్రమంత్రికి శ్రీధర్‌బాబు అందించారు. పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన ద్వారా జాతీయ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)కి గణనీయంగా దోహదపడాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. కాగా, ఈ నెలాఖరులో తెలంగాణకు వచ్చి రాష్ట్రంలో నెలకొని ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పనితీరుతోపాటు, సంబంధిత పరిశ్రమల పునరుద్ధరణకు చర్యలు చేపట్టే దిశగా సమీక్ష నిర్వహిస్తానని మంత్రి శ్రీధర్‌బాబుకు కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాల మేరకు తమవంతు సహకారం అందిస్తామని భరోసా కల్పించారు. తమ విజ్ఞప్తిపై కేంద్రమంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించడంపై శ్రీధర్‌బాబు హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.