14-07-2025 12:50:35 AM
మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ యాదవ్
కల్వకుర్తి, జూలై 13:కల్వకుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పట్ల ప్రతిపక్షాలు అజీర్తితో అసూయ చూపిస్తున్నాయని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మనీలా సంజీవ్ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. ఆదివారం స్థానిక మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అచ్చంపేట, జడ్చర్ల నియోజకవర్గాల్లో వంద పడకల ఆసుపత్రులు పూర్తయ్యాయి. కానీ కల్వకుర్తిలో మాత్రం పనులు ప్రొసీడింగ్స్ దశకే పరిమితమయ్యాయి.
దీనికి బాధ్యత మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవే అని ఆయన అన్నారు. వారి అసమర్థత వల్లే అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అప్పటి ఎమ్మెల్సీగా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సాగునీటి కోసం తన సొంత నిధులతో కృషి చేసి, అధికారులను, రైతులను ఒప్పించి అభివృద్ధికి మార్గం సుగమం చేశారని గుర్తు చేశారు. అదే సమయంలో జైపాల్ యాదవ్ మాత్రం తమ పార్టీ మంత్రుల అనుచరులకు లాభం చేకూరేలా వ్యవహరించారని, కల్వకుర్తి అభివృద్ధికి అడ్డుగా నిలిచారని ఆరోపించారు.
కాలువల్లో మరమ్మతులు జరుగుతుండగా మాపై కుట్రపూరితంగా కేసులు పెట్టి జైలుకు పంపించే ప్రయత్నాలు జరిగాయని అయినా మేము వెనక్కి తగ్గలేదన్నారు. ప్రజల మద్దతుతో ముందుకు సాగుతున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కాక, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్వహిస్తున్నామన్నారు. మా నాయకుడిపై అవమానకరంగా వ్యాఖ్యలు చేస్తే మౌనంగా ఉండబోమని, అలాంటి వారికి ప్రజలు తగిన బుద్ది చెబుతారనిఅన్నారు.