calender_icon.png 6 November, 2025 | 5:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రయాణం.. ప్రమాదం

06-11-2025 12:49:54 AM

  1. బస్సు ప్రమాదాలు... భద్రత లోపాలు 
  2. సీట్ల పరిమితికి మించి ప్రయాణం  గాలిలో ప్రాణాలు 
  3. బస్సులు ఎక్కాలంటేనే భయం... భయం! 
  4. ప్రమాదం జరిగితేనే... ప్రభుత్వ స్పందనా..? 

నకిరేకల్, నవంబర్ 5 :  గమ్యం చేరుకోవాలనే ఆత్రంలో ప్రయాణం చేస్తే, ఇప్పుడు ప్రాణాలకే రిస్క్గా మారుతోంది. రహదారి భద్రతా లోపాలు, రోడ్ల విస్తరణలో ఆలస్యం, అధిక వేగం, అధికారుల నిర్లక్ష్యం, సీట్ల పరిమితికి మించి ప్రయాణం ఇవన్నీ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి.గత పది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న వరుస బస్సు ప్రమాదాలు ప్రజల హృదయాలను పిండేశాయి.

ఘోరమైన ప్రమాద మరణాలు అందరినీ కంటతడి పెట్టించాయి. అనేక కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఆ కుటుంబాల ఆర్తనాదాలు ప్రతి హృదయాన్నీ తాకుతున్నాయి.ఈ ప్రమాద ఘంటికలకు బాధ్యులు ఎవరు? పాలకుల నిర్లక్ష్యమా? భద్రతా లోపమా? అతివేగమా? సీట్ల పరిమితి మించి ప్రయాణమా? రోడ్ల దుస్థితి లేదా అధికారుల నిర్లక్ష్యమా?ప్రమాదాలు జరిగాకే ప్రభుత్వం స్పందిస్తుందా అనే ప్రశ్న ప్రజల్లో వినిపిస్తోంది.

నిజానికి ప్రజలను గమ్యస్థానాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించేది ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) బస్సులు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజా రవాణా వ్యవస్థలో ఆర్టీసీ కీలకమైన పాత్ర పోషిస్తున్నప్పటికీ, భద్రతా ప్రమాణాలు మాత్రం ప్రశ్నార్థకంగా మారుతున్నాయి.ప్రమాదాలకు అనేక కారణాలు ఉన్నప్పటికీ, మరణాలు ఎక్కువవడానికి ప్రధాన కారణం బస్సులో కెపాసిటీకి మించి ప్రయాణికులు ఎక్కడం.

ఇది అందరికీ తెలిసిన విషయమే. ఓవర్లోడింగ్ వల్ల బస్సు స్థిరత్వం తగ్గి, బ్రేకులు, టైర్లు, సస్పెన్షన్ వ్యవస్థలు దెబ్బతింటాయి. చిన్న తప్పిదం కూడా పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది.మోటార్ వెహికిల్స్ యాక్ట్, 1988 ప్రకారం ప్రతి బస్సుకు సీటింగ్ కెపాసిటీ, నిలబడే ప్రయాణికుల పరిమితి నిర్ణయించబడాలి. ప్రైవేట్ బస్సుల్లో రూల్ ఉల్లంఘిస్తే ఆర్టీఏ అధికారులు జరిమానాలు విధిస్తారు. కానీ ఆర్టీసీ బస్సుల్లో మాత్రం నిబంధనలను పట్టించుకోవడం లేదు. 

7 డిపోల్లో 700 బస్సులు ..

నల్గొండ ఆర్టీసీ రీజనల్ పరిధిలో నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండ, నార్కట్పల్లి, కోదాడ, సూర్యాపేట, యాదగిరిగుట్ట మొత్తం ఏడు డిపోలు ఉన్నాయి. ఈ పరిధిలో ఆర్టీసీకి చెందిన 335 బస్సులు, ప్రైవేట్ (హైర్) బస్సులు 215, ఎలక్ట్రిక్ బస్సులు 157 ఉన్నాయి. మొత్తం సిబ్బంది సుమారు 2,200 మంది. అదనంగా ఎలక్ట్రిక్ మరియు ప్రైవేట్ బస్సుల్లో 744 మంది డ్రైవర్లు, కండక్టర్లు పనిచేస్తున్నారు.

ఉదయాన్నే పల్లెల నుండి పట్టణాలకు బస్సులు రద్దీగా రావడం, విద్యార్థులు, ఉద్యోగులు, టీచర్లు ప్రయాణించే సమయాల్లో తీవ్ర రద్దీ ఉండటం ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు. ముఖ్యంగా సూర్యాపేట, కోదాడ, నల్గొండ, భువనగిరి, నార్కట్పల్లి డిపోల నుండి హైదరాబాద్ రూట్లలోబస్సులుకిక్కిరిసిపోతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. రద్దీ తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

వరుస బస్సు ప్రమాదాలు ... గాలిలో ప్రాణాలు 

గత 15 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి రోజు ఎక్కడో ఒక చోట ఆర్టీసీ లేదా ప్రైవేట్ బస్సు ప్రమాదం జరుగుతోంది. ఒక ఘటన మరవకముందే మరొక ఘటన చోటు చేసుకుంటుండటంతో ప్రజలు ఉలిక్కిపడుతున్నారు.  

కర్నూలు జిల్లాలో వి.కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 20 మంది మృతి, చేవెళ్లలో ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. వికారాబాద్ జిల్లా తాండూర్ మండలంలో సిమెంట్ లారీని ఢీకొట్టిన కర్ణాటక ఆర్టీసీ బస్సులో పలువురికి గాయాలు. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలో ట్రాక్టర్ను ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో కూడా గాయాలు. ఇలా రోజూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రయాణికుల రద్దీ ఉన్నా ...ప్రమాదాలు లేవు..

నల్గొండ రీజనల్ పరిధిలో ప్రయాణికుల రద్దీ ఉన్నది నిజమే. దానికి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాం. ఒత్తిడిని తగ్గించే చర్యలు తీసుకున్నాం. భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రతిరోజూ బస్సుల ఫిట్నెస్, డ్రైవర్ల బ్రీత్-అనలైజర్ పరీక్షలు నిర్వహించి తర్వాతే బస్సులు రోడ్డు మీదకు వస్తాయి. మా పరిధిలో ఇప్పటివరకు పెద్ద బస్సు ప్రమాదం జరగలేదు. చిన్న ఘటనల్లో కూడా ఆర్టీసీ తప్పు కాదు ఎక్కువగా ఇతర వాహనాల నిర్లక్ష్యమే కారణం.

- జాన్‌రెడ్డి, ఆర్టీసీ రీజనల్ మేనేజర్, నల్గొండ