10-10-2024 12:00:00 AM
పూనమ్ చతుర్వేది.. ప్రాణాంతక బ్రెయిన్ ట్యూమర్‌ను అధిగమించి దేశంలోనే అత్యంత పొడవైన మహిళా బాస్కెట్ బాల్ క్రీడాకారిణిగా నిలిచింది. లోపాలను, శాపాలను ఆయుధంగా మలచుకొని ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ కోర్టులో సత్తా చాటుతోంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని విజయమే లక్ష్యంగా దూసుకెళ్తున్న ఆమె ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.
పూనమ్ చతుర్వేది మిగతవారి కంటే ఏడు అడుగుల ఎత్తు ఉంటుంది. ఆ లోపమే ఆమెకు శాపమైంది. వరమైంది కూడా. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్‌లో జన్మించిన పూనమ్ ఎప్పుడూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటుంది. ఆమె ఎత్తే అందుకు కారణం. హైస్కూలులో చదివేటప్పటికీ పూనం ఆరడుగుల ఎత్తు. తోటి స్నేహితులు ఆమెను ఆటపట్టిస్తూ మానసిక వేధింపులకు గురిచేసేవారు.
‘టాల్ గర్ల్’ అంటూ ఎత్తును లక్ష్యంగా చేసుకుని సూటీపోటీ మాటలతో బాధించేవారు. దీనికితోడు కారులో కూర్చున్నప్పుడు, పాఠశాలకు వెళ్లేటప్పుడు, ఇంటికి తిరిగివచ్చేటప్పుడు ఇలా ప్రతి సందర్భంలోనూ ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆ మాటలకు ఇతరులు అయితే ఇంటికి పరిమితమవుతారు. కానీ పూనమ్ ఆ విమర్శలన్నీ పాజిటివ్‌గా తీసుకుంది.
ఒక్కో అవకాశం అందుకుంటూ
కోర్టులో చురుగ్గా కదులుతూ గోల్స్ ఈజీగా వేస్తుండటంతో పూనమ్‌కు ఎన్నో అవకాశాలొచ్చాయి. ఆమె ఎత్తు ఆమెకు గొప్ప ఆస్తిగా మారడానికి ఎంతోకాలం పట్టలేదు. చూస్తుండగా రాష్ట్ర జట్టులో స్థానం సంపాదించుకుంది. అయితే కెరీర్ ఊపందుకుంటున్న సమయంలోనే జీవితం ఊహించని సవాలు విసిరింది. 2013లో పూనమ్ బ్రెయిన్ ట్యూమర్ బారిన పడింది.
ఈ పరిణామం బాస్కెట్ బాల్ కలలకే కాదు తన ప్రాణాలకే ముప్పుగా మారింది. రెండు మేజర్ సర్జరీలు జరగడంతో ఐదేళ్లపాటు ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇన్ని ఎదురుదెబ్బలు తగిలినా పూనమ్ స్ఫూర్తి ఏమాత్రం తగ్గలేదు. బాస్కెట్ బాల్ పట్ల ఆమెకున్న ప్రేమ, సాధించాలనే సంకల్పం ఆమెను ఉన్నత శిఖరాలవైపు అడుగులు వేయించింది.
2019లో ఆటలోకి అడుగుపెట్టి అదరహో అనిపించుకుంది. ఆ తర్వాత ఇండియన్ విమెన్స్ బాస్కెట్ బాల్ జట్టులో స్థానాన్నీ సంపాదించుకొని పలు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో ఆడే అవకాశాన్నీ అందుకొని జట్టును గెలిపించడంలో కీలకంగా వ్యవహరించింది.
అలా మొదలైంది
ఓరోజు పూనమ్ వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా.. ఓ ఫ్యామిలీ ఫ్రెండ్ దృష్టి ఆమెపై పడింది. మెరుపు వేగంతో పూనమ్ దగ్గరకు వెళ్లి “బాస్కెట్ బాల్ ఆట గురించి నీకు తెలుసా? ఆ ఆట గురించి ఎప్పుడైనా ఆలోచించ వా?” అని అడిగా డు. ఈ ఘటనే పూనమ్ జీవితాన్ని మలుపు తిప్పింది.
బాస్కెట్ బాల్ గేమ్‌ను రక్షణ కవచంగా మలుచుకొ ని కోర్టులో అడుగుపెట్టింది. విమర్శల న్నీ పక్కనపెట్టి ఆటను సీరియస్‌గా తీసుకుంది. ఛత్తీస్‌గఢ్ బాస్కెట్ బాల్ కోచ్ రాజేష్ పాటిల్ వద్ద చేరింది. తక్కువ కాలంలోనే ఈమె ఆటలో నైపుణ్యాలను గుర్తించిన కోచ్ స్థానిక పోటీలకు పంపడం మొదలుపెట్టారు.