31-10-2025 01:07:25 AM
 
							ఖమ్మం, అక్టోబర్ 29 (విజయక్రాంతి): భారీ వర్షాలు కురిసి గతేడాది ఇదే సమయంలో మున్నేరు ఉధృతంగా ప్రవహించిం ది. ఖమ్మం నగరంలోని జనావాసాలను ముంచెత్తింది. వందలాది ఇండ్లు నీటమునిగి లోతట్టు ప్రాంతవాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోజుల తరబడి నిరాశ్రయులయ్యారు. ఆ చేదు అనుభవం మరువకముందే తాజాగా ముంథా తుఫాన్ ఎఫెక్ట్ మరోసారి నగరవాసులపై పడింది.
ఎగువన కురిసిన వర్షాలకు మున్నేరుకు వరద పోటెత్తింది. నది ఒడ్డున ఉన్న కాల్వొడ్డు, బొక్కల గడ్డ, సుందరయ్యనగర్, రంగనాయకుల గుట్ట, బైపాస్‌రోడ్డు ప్రాంతాల్లోని ఇండ్లు నీట మునిగాయి. గతేడాది ముంపు విపత్తు సంభవించినప్పుడు నదికి ఇరువైపులా యుద్ధప్రా తిపదికన రిటైనింగ్ వాల్స్ నిర్మిస్తామన్న ప్రభుత్వం.. ఆ మాటను నిలబెట్టుకోకపోవ డం వల్లనే ఈ సమస్య అని ముంపు వాసులు మండిపడుతున్నారు.
ఏటా మున్నే టి వరద ఇలాగే ముంచెత్తుతుందని, అధికారులు తమకు నామమాత్రపు పరిహారం ఇ చ్చి చేతులు దులుపుకొంటున్నారే తప్ప శాశ్వ త పరిష్కారం చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరద ముంచేత్తకుండా ఉండేందుకు మొదలుపెట్టిన రిటైనింగ్ వాల్ పనులు నత్తనడకన సాగుతున్నాయని, పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
భారీ వర్షాలు కురిస్తే ముంచెత్తడమే..
మున్నేరు వరంగల్ జిల్లా, పాకాల సరస్సు వద్ద పుట్టి, దిగువన ఖమ్మానికి ప్రవహిస్తుంది. ఖమ్మం గ్రామీణ మండలంలోని తీర్థాల గ్రామం వద్ద మున్నేరులో ఆకేరు కలుస్తుంది. మున్నేరు, ఆకేరు జన్మస్థలాలు ఎగువన ఉన్నాయి. వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసిన మున్నేటికీ సాధారణ వరద మొదలై 6 నుంచి 8 అడుగుల మేర ప్రవహిస్తుంది. భారీ వర్షాలు కురిసినప్పుడు మాత్రం మున్నేటికీ వరద పెరుగుతుంది.
ఈ వరదకు చుట్టుపక్కల చిన్నచిన్న వాగులు, వంకలు కలవడంతో వరద ఉధృతి భీకరంగా ఉంటుంది. మున్నేటిలో వరద ప్రవాహం దాదాపు 15 అడుగుల మేర పెరిగినా పరీవాహక ప్రాంతాలకు పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ ప్రస్తుతం ఎగువన కురుస్తున్న వర్షాలకు మున్నేటి ఉధృతి దాదాపు 27 అడుగులకు చేరుకుంది. బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో 8 నుంచి 9 అడుగుల ప్రవాహాన్ని నమోదు చేసిన మున్నేరు.. రాత్రికి 24 అడుగులకు చేరుకుంది.
గురువారం ఉదయానికి 25 అడుగులు, సాయంత్రానికి మరో రెండు అడుగులు పెరిగి ప్రస్తుతం 27 అడుగుల మేర ప్రవహిస్తోంది. దీంతో ఖమ్మం పట్టణంలోని మున్నేటి పరీవాహక ప్రాంతాలైన బొక్కల గడ్డ, కాల్వ ఒడ్డు, మోతినగర్, జలగంనగర్, ఏదులాపురం, ధంసలాపురం, రామకృష్ణాపురం జలమమయ్యాయాయి. ఈ ప్రాంతాల్లోనే దాదాపు 200 కుటుంబాలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. గతేడాది జరిగిన నష్టాన్ని ఇంకా పూర్చుకోక ముందే మళ్లీ మరో మారు వరద ముంచెత్తడంతో ఆయా కాలనీల ప్రజలు కన్నీటి పర్యంతమవుతున్నారు.
ఆక్రమణలే కారణమా..
గతంలో మున్నేటికి వరదలు వచ్చి పరీవాహక ప్రాంతాలు ముంపునకు గురైన ఘటనలు తక్కువే అని కొంతమంది గుర్తు చేసుకుంటున్నారు. మున్నేటి ప్రవాహాన్ని సాఫీగా సాగనివ్వకుండా ఆక్రమణలు చేస్తూ దాదాపు ఏరు మధ్య వరకు ఇళ్ల నిర్మాణాలు జరుపుతున్నారు. ఇక కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు మున్నేటి వారగా వెంచర్లు వేస్తూ ప్రజలకు అంటగడుతున్నారు. ఆక్రమణలను చూసీ చూడనట్టు వదిలివేయడం చెక్ డ్యామ్ ఎత్తు విషయంలో నిర్లక్ష్యం వల్లే మళ్లీ మరోమారు మున్నేటి వరదకు, పరీవాహక ప్రాంతాల కాలనీల ముంపునకు కారణమనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి
ఎప్పటికి పూర్తవుతుంది..?
మున్నేటికి వరద పరిష్కారంగా మున్నేరు వారగా ఎత్తున అడ్డు గోడ నిర్మించడమే శాశ్వత పరిష్కారమని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు వేసి, గోడ నిర్మాణాన్ని కొద్ది నెలల కిందట ప్రారంభించింది. కానీ అయితే ముందుగా అనుకున్న దాని ప్రకారం గోడను నిర్మించేందుకు అవసరమైన భూసేకరణకు ఖర్చు భారీగా ఉందని మున్నేటికి దూరంగా కట్టాల్సిన గోడను కాస్త దగ్గరకు జరిపి కడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇక ఆ నిర్మాణమైనా సాఫీగా సాగుతుందా అంటే అదీ లేదని, పనులు నత్తను తలపిస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీనికి తోడు గోడ నిర్మాణం వల్ల నష్టపోతున్న బాధితులకు నష్టపరిహారం చెల్లింపు విషయంలో కూడా ప్రభుత్వం తాత్సారం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి ముంపునకు గురైన ప్రతిసారి ఇబ్బంది పడుతున్న ప్రజలకు ప్ర భుత్వం సరైన సాయం అందిస్తోందా అంటే అదీ లేదనే అభిప్రాయం వినిపిస్తోంది.
లోతట్టువాసులు అప్రమత్తంగా ఉండాలి
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
మున్నేరు వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ముంపువాసులు అప్రమత్తంగా ఉండాలని, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్డి ఆదేశించారు. ఖమ్మం కాల్వొడ్డు వద్ద 25 అడుగుల మేర ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరును గురువారం, నగర మేయర్ పునకొల్లు నీరజ, అదనపు కలెక్టర్ పి.శ్రీజ, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి, ధంసలాపురం పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, నయాబజార్ కళాశాలలో పునరావాస కేంద్రాలకు తరలించామని తెలిపారు. నెమ్మదిగా పెరుగుతున్న మున్నేరు నీటిమట్టం ప్రవాహాన్ని అధికారులు పర్యవేక్షిస్తూ సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అనంతరం నయాబజార్ స్కూల్, నయాబజార్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.
ప్రజలకు కల్పించిన వసతులు, భోజనం నాణ్యత, హెల్త్ క్యాంప్ ను పరిశీలించారు. అత్యవసర సమయాల్లో ఫిర్యాదుకు టోల్‌ఫ్రీ నంబర్లు 1077, 9063211298కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా, ఖమ్మం ఆర్డీవో నరసింహారావు, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి, ఖమ్మం నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ అనిల్ కుమార్, ఖమ్మం అర్బన్ మండల తహసీల్దార్ సైదులు, మున్సిపల్, పోలీస్, ఇరిగేషన్ వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
నాకు ముగ్గురు పిల్లలు. నా భర్త చనిపోయాడు. మున్నేటి పరీవాహక ప్రాంతంలో నివసిస్తున్నాం. ప్రస్తుతం వరద మాదిరే గతేడాది వరద వచ్చినప్పుడు మా ఇల్లు పూర్తిగా మునిగిపోయింది. మళ్లీ వరద ముంచెత్తకుండా ఎత్తున గోడ కడుతున్నామని, అందులో భాగంగా ఇల్లు కోల్పోతున్న మాకు నష్టపరిహారం కింద ప్రభుత్వం మరోచోట స్థలం చూపెడుతుందని ప్రభుత్వ అధికారులు చెప్పారు. అందుకోసం సంతకాలు కూడా చేయించుకున్నారు. ఆ గోడ ఇప్పటికీ పూర్తి చేయలేదు. మాకు మరోచోట స్థలం కేటాయించలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు మాకు వేరే చోట స్థలం చూపించి, ఇల్లు కట్టుకునేందుకు సాయం చేయాలి.
పాటి మహాలక్ష్మి, ముంపు బాధితురాలు, ఖమ్మం
శాశ్వత పరిష్కారం చూపించాలి
మేము బీదవాళ్లం. ఉన్న వాళ్ల మాదిరి ఖరీదు ఎక్కువ ఉన్నచోట్ల ఇల్లు కట్టుకోలేము. మాకు ఉన్నంతలో మున్నేటికి దగ్గరలో ఇల్లు కట్టుకున్నాం. మున్నేరుకి వరద వచ్చిన ప్రతిసారి ఇల్లు మునిగిపోయి తీవ్ర నష్టం జరుగుతోంది. నష్టం లక్షల్లో ఉంటే ప్రభుత్వం పరిహారాన్ని వేలల్లో ఇస్తోంది. బీదల ఇబ్బందులను ప్రభుత్వం గమనించి వేరేచోట సరైన ఇల్లు చూపించి, ఆదుకోవాలి.
వాంకుడోతు అచ్చా, ఖమ్మం

వాన వెలిసింది.. వెత మిగిలింది!
హనుమకొండ/ హనుమకొండ టౌన్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): ‘మొంథా’ తుఫాన్ వరంగల్, హనుమకొండను గడగడలాడించింది. మునుపెన్నడూ లేని విధంగా 24 గంటల వ్యవధిలోనే హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో 42.20 సెం.మీ, వరంగల్ జిల్లా కల్లెడలో 41.55 సెం.మీ వర్షపాతం నమోందైంది. భారీ వర్షాల కారణంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 118 కాలనీలు జలమయమయ్యాయి.
గురువారం ఉదయానికి వాన వెలిసినప్పటికీ చాలా కాలనీలు, వీధుల్లో వరద నీరు అలాగే నిలిచి ఉంది. వరంగల్‌లోని రంగంపేట, కాపువాడ, 100 ఫీట్ల రోడ్డు పరిసర కాలనీలైన వివేక్‌నగర్, ప్రగతినగర్, సమ్మయ్యనగర్, ఎన్జీవోస్ కాలనీ, ఉర్సు, పోతన రోడ్డు, దీన్ దయాల్ కాలనీ, బాలసముద్రం వంటి ప్రాంతాలు నీట మునిగాయి. ఇండ్లలోకి నీళ్లు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. రోడ్లపై నీళ్లు ప్రవహించడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు నిచిపోయాయి.
అధికారులు అప్రమత్తమై ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బాధితులకు ఎలాంటి ఇబ్బందులూ కలుగకుండా చర్యలు చేపట్టారు. పలు కాలనీలో రోడ్లపై వరదల్లో కార్లు, మోటారు సైకిళ్లు కొట్టుకుపోయిన సంఘటనలు కనిపించాయి. బుధవారం రాత్రి నుంచి పలువురు బాధితులు ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. హనుమకొండలో సుమారు 40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి కల్వర్టులు, కాలువలు, ఏరులై ప్రవహించాయి.
హనుమకొండ గోపాలపురం ఊరచెరువు కట్ట తెగిపోవడంతో హమనుకొండకు ప్రమాదంగా మారింది. గోపాలపురం పరిసరకాలనీలైన ప్రగతి నగర్, వివేక్ నగర్, అమరావతి నగర్, విద్యానగర్, వాజ్పేయి కాలనీ, టీవీ టవర్ కాలనీ లు ప్రమాదపు అంచులలో చేరుకున్నాయి. యూనివర్సిటీ నుంచి కాజీపేటకు వెళ్లే రహదారి మొత్తం నీటితో మునిగిపోయింది. సమ్మయ్య నగర్ ప్రాథమిక పాఠశాల పూర్తిగా మునిగిపోయింది. చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. నాలాల ఆక్రమణ, అక్రమంగా నాలాలపై నిర్మాణాలు చేపట్టడం, చెరువులు ఆక్రమణకు గురైనా పాలకులు పట్టించుకోకపోవడం మూలంగానే చిన్నపాటి వర్షానికి కూడా వరంగల్ లాంటి పెద్ద నగరాలలో వరదలు ముంచెత్తుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.
ఇటువంటి భారీ వర్షాలు వచ్చినప్పుడు ప్రజలు వరదల్లో చిక్కుకుపోయి బిక్కుబిక్కుమంటూ భయాందోళన మధ్య బతకాల్సిన పరిస్థితి వస్తుందని నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నాలాలపై అక్రమ కట్టడాలు తొలగించి వరదలు నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
నిర్లక్ష్యానికి మూల్యం.. వరద ముంపు
హనుమకొండ గోపాలపురం చెరువులోకి చేరిన వరద తరలించేందుకు ఏర్పాటు చేసిన అండర్ గ్రౌండ్ టన్నెల్ షెటర్లను తీసి ఉంచకపోవడంతోనే వరద ముంచెత్తిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. తుఫాన్ ఉందని తెలిసినా అధికారులు పట్టించుకోకపోవడంతో వరదనీరు పూర్తిగా కాలనీలు ముంచెత్తిందని, ఇరిగేషన్ మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యానికి అనుమకొండ సగం మంపునకు గురైందని పలువురు ఆరోపిస్తున్నారు.
గతంలో వచ్చిన వరద ముప్పు నివారించడానికి గత ప్రభుత్వం హయాంలో రూ.100 కోట్లతో అండర్ గ్రౌండ్ టన్నెల్ ద్వారా వరద కాలువలను నిర్మించింది. గోపాలపురం చెరువు నుంచి వచ్చే వరదను 100 ఫీట్ రోడ్ల కింది భాగం నుంచి తరలించడానికి టన్నెల ద్వారా ఏర్పాటు చేశారు. అమరావతి నగర్ సమ్మె నగర్ మీదుగా నయం నగర్ వంతెన కింద నీటిని మళ్లించడానికి చేపట్టిన ఈ వంతెన నిర్మాణం పూర్తయిన కూడా నిన్న కురిసిన వర్షానికి పనికి రాకుండా పోయింది.
దాన్ని ఉపయోగించక పోవడం వల్ల వరద ప్రవహించి కాలనీలు జలమయమయ్యాయి అని పలువురు ఆరోపిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా హంటర్ రోడ్ లోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలోని సోషల్ వెల్ఫేర్ స్కూల్ ప్రాంగణంలో వరద నీరు చేరింది. దీంతో స్థానిక కార్పొరేటర్ మామిండ్ల రాజు యాదవ్, సుబేదారి సీఐ రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారికి భోజన సదుపాయాలు కల్పించారు.
వరంగల్ నగరంలోని హంటర్ రోడ్, రామన్నపేట ప్రాంతంలో వర్షం పడితే చాలు రోడ్లు చెరువుల్లా మారిపోతున్నాయి. ప్రతి వర్షానికి ఇదే దుస్థితి పునరావృతం అవుతుండగా స్థానికులు ఇది ప్రకృతి తప్పు కాదు సంవత్సరాలుగా కొనసాగుతున్న నిర్లక్ష్య పాలన ఫలితం అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భద్రకాళి చెరువు సమీపంలోని వరదనీటి ఉధృతి వల్ల పెద్దమ్మ గడ్డ సమీపంలోని కాకతీయ కాలనీ ఫేస్ టు, అలంకార్ జంక్షన్ మొత్తం వరద నీటిలో మునిగిపోయింది. తద్వారా పెద్దమ్మ గడ్డ నుంచి రెడ్డి కాలనీకి రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.