calender_icon.png 28 November, 2025 | 3:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభం

28-11-2025 12:16:55 AM

మహబూబాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభించారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికలు నిర్వహించే గూడూరు, ఇనుగుర్తి, కేసముద్రం, మహబూబాబాద్, నెల్లికుదురు మండలాల్లోని గ్రామాల సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. జిల్లాలో తొలి దశ నిర్వహించే పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించగా 105 మంది సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు చేయగా, 41 మంది వార్డు సభ్యుల పదవికి నామినేషన్లు దాఖలు చేసినట్లు జిల్లా అధికారులు తెలిపారు. 

మహమూద్ పట్నం పంచాయతీ ఎన్నికపై ‘స్టే’?

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్ పట్నం గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు స్టే విధించినట్లు ప్రచారం సాగుతోంది. గ్రామంలో ఎస్టి కేటగిరిలో ఆరుగురు ఓటర్లు ఉండగా, సర్పంచ్ సహా మూడు వార్డు సభ్యుల పదవులను ఎస్టి కేటగిరికి కేటాయించడంతో, బీసీలు అధికంగా ఉన్న గ్రామంలో ఎస్టిలకు అధిక పదవులు కేటాయించడం పై కోర్టుకు వెళ్లగా, ఎన్నికల అధికారులను వివరణ కోరుతూ కోర్టు స్టే విధించినట్లు ప్రచారం సాగుతోంది. ఈ అంశంపై కేసముద్రం ఎంపీడీవో క్రాంతిని వివరణ కోరగా కోర్టు స్టే విధించినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, తమకు ఉత్తర్వులు అందలేదని తెలిపారు.