29-11-2025 12:33:00 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 28 (విజయక్రాంతి): వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం రాష్ట్ర ఎంపీలు చిత్తశుద్ధితో కృషి చేయాలని ప్రజా ఐక్య కూటమి ఛైర్మన్ దాసు సురేష్ డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా సభలో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టాలని కోరారు. గురువారం సచివాలయం మీడియా పాయింట్ వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీల హక్కుల సాధన కోసం భవి ష్యత్ కార్యాచరణను ప్రకటించారు.
తెలంగాణలో 42 శాతం రిజర్వేషన్లు అమలు కావా లంటే రాజ్యాంగ సవరణ ప్రక్రియ ద్వారానే సాధ్యమవుతుందని దాసు సురేష్ స్పష్టం చేశారు. గతంలో తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలైనా, ఈడబ్ల్యూఎస్ రూ పంలో 50 శాతం సీలింగ్‌ను అధిగమించి రిజర్వేషన్లు పెరిగినా.. అవన్నీ రాజ్యాంగ సవరణ ద్వారానే జరిగాయని గుర్తుచేశారు. ప్రతిపక్షాలు, బీసీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మానేసి, ఈ దిశగా కార్యచరణ రూపొందించాలని హితవు పలికారు.
డిసెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో రిజర్వేషన్ల పెంపు కోసం రాష్ట్ర ఎంపీలు ప్రైవేటు బిల్లును తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇదే వారి చిత్తశుద్ధికి నిదర్శనమని, లేనిపక్షంలో వారిని ‘బీసీ ద్రోహులు’గా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించారు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలు కేవలం రిజర్వడ్ స్థానాలకే పరిమితం కాకూడదని దాసు సురేష్ పిలుపునిచ్చారు. జనరల్ స్థానాల్లోనూ పోటీకి దిగి, బలమైన బీసీ ఉద్యమ ఆకాంక్షను చాటాలన్నారు.
బీసీ అభ్యర్థులకు మద్దతుగా త్వరలోనే ప్రజా ఐక్య కూటమి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త రథయాత్ర నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ఉద్యమాన్ని బలోపేతం చేయడం, ఢిల్లీ కేంద్రంగా పార్లమెంట్‌లో పోరాడటం అనే ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్తామని తెలిపారు. ఈ సమావేశంలో బండారు పద్మావతి, మధు యాదవ్, మాధవి, జ్యోతి, అభినవ్ పాల్గొన్నారు.