29-11-2025 12:41:38 AM
ఆదిలాబాద్, నవంబర్28(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులు పరేషాన్ అవుతున్నారు. ఈ ఏడాది ఓ వైపు అధిక వర్షాలతో పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపగా, మరోవైపు పండిన ఆ కాస్త పంటను మార్కెట్‌కు తీసుకొచ్చిన రైతులకు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ సీసీఐ విధించే నిబంధన లు గుది బండలా మారుతున్నాయి.
12 శాతం తేమ దాటితే సీసీఐ అధికారులు కొనుగోలు చేయకపోవడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. తాజాగా పత్తిని మార్కెట్ కు తీసుకొచ్చిన వందలాది మంది రైతుల పత్తిలో తేమ శాతం 12 కంటే కొంత అధికంగా చూపించడంతో అధికారులు కొనుగోలుకు నిరాకరించడం...అటు ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిద్దామంటే ధర చాలా తక్కువగా ఉండటంతో అమ్ముకోలేక కొందరు రైతులు పత్తిని తిరిగి ఇంటికి తీసుకెళ్లగా, మరికొందరు గత్యంతరం లేక అక్కడి మార్కెట్లోనే ఆరబెట్టుకుంటున్నారు.
కొన్ని రోజుల నుంచి తిండి తిప్పలు మాని.. నిద్రలేక అక్కడే పడిగాపులు కాస్తున్నారు. 12 కంటే ఒక్క శాతం అధి కంగా చూపించిన సీసీఐ అధికారులు కొనుగో లు చేయడం లేదు. ఇలా అనేక మంది రైతులకు ఇలాంటి పరిస్థితి ఎదురుకావడంతో ఆందోళనకు గురవుతున్నారు.
రైతులకు తప్పని తిప్పలు...
మార్కెట్‌కు పత్తిని తీసుకొచ్చిన రైతుల బాధలు వర్ణణాతీతంగా మారింది. ఆదిలాబా ద్ మార్కెట్లో ఇటీవల కొనుగోళ్లు ప్రారంభం కావడంతో నూతనంగా తెచ్చిన కిసాన్ కపాస్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకున్న రైతు లు 500 మంది పత్తి వాహనాలతో మార్కెట్ కు వచ్చారు.
తీరా ఇక్కడకు వచ్చిన తరవాత తేమ అధికంగా చూపించడంతో సీసీఐ కొర్రీలు పెడుతోంది. ప్రైవేట్ లో తక్కువ ధర ఉండటంతో అమ్ముకోలేని పరిస్థితి ఎదురైంది. ప్రత్యేకంగా కూలీలను పెట్టి పత్తిని ఆరబెడుతున్నారు. వీరికి రోజు కూలీ ఇవ్వడంతో పాటు ట్రాక్టర్ కిరాయి కోసం రోజుకు రూ.3 వేల చొప్పున చెల్లిస్తున్నారు.
ప్రతి ఏటా ఇదే తంతు...
ఆదిలాబాద్ జిల్లాలో రైతులకు ప్రతి ఏటా అకాల వర్షాలు, తేమ అధిక శాతం రావడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే రెండు రోజుల పాటు మార్కెట్లోనే ఉండటం.. మరో వైపు తుఫాను కారణంగా మార్కెట్ కు ముందస్తుగానే సెలవు ప్రకటించడంతో రైతులు మరో రెండు రోజుల పాటు మార్కెట్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
మరో పక్క కొందరు రైతులు పత్తిని ఆరబెట్టుకుంటూ అక్కడే నిద్రిస్తూ నరకయాతన పడుతున్నారు. ట్రాక్టర్ ఖర్చు.. కూలీలకు వేచించే ఖర్చుతో పత్తిని అమ్మినా ఎలాంటి ప్రయోజనం ఉండదని వాపోతున్నారు..
చేతికి అందిన పంటపై పందుల దాడి
ఓవైపు అధిక వర్షాలు, సీసీఐ నిబంధనలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు మరోవైపు అడవి పందుల బెడద సైతం మరింత కృంగదీస్తోంది. బేల మండలం కాప్సి గ్రామానికి చెందిన కౌలు రైతు జక్కుల నాగన్న తన 7 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశాడు.
ఐతే చేతికి అందిన పంటపై అడవి పందులు దాడి చేసి పూర్తిగా ధ్వంసం చేశాయి. కోతకు సిద్ధంగా ఉన్న పంట నేలమట్టం కావడంతో రైతు తీవ్రంగా నష్టపోయారు. కళ్ళముందే పంట సర్వనాశనం కావడంతో సదరు రైతు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తనను ఆదుకోవాలని కోరారు.
రైతుల పక్షాన ప్రభుత్వాలు నిలబడటం లేదు
రైతుల పక్షుల కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎందు కు నిలబడడం లేద ని ప్రశ్నించారు. ఇప్పటి వరకు రైతులు తేమ శాతం, వేలి ముద్ర నిబంధనతో ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటే కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎందుకు బోరు మెదపడం లేదని మండిపడ్డారు. గత తమ బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో డిసెంబర్ నెల వరకు తేమ శాతం సాకు లేకుండానే కొనుగోళ్లు చేపట్టామన్నారు.
మాజీ మంత్రి జోగు రామన్న