calender_icon.png 29 November, 2025 | 1:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

42 శాతం బీసీ కోటా ఎక్కడ?

29-11-2025 12:42:53 AM

  1. కాంగ్రెస్ పార్టీ మాటలు వట్టి బూటకం
  2. సర్పంచ్‌కు నామినేషన్లు ప్రారంభమైనప్పటికీ, బీసీల పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధి ఏది? 
  3. జనరల్ స్థానాల్లో కూడా బీసీలు బరిలో నిలవాలి
  4.   6 వేల సర్పంచ్ స్థానాలు బీసీలవే..
  5. రేపు చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయండి
  6. బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ పిలుపు

ముషీరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం చట్టపరంగా రిజర్వేషన్లు కల్పిస్తామని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ, పార్టీ పరంగా ఇస్తామన్న 42% కూడా వట్టి బూటకం అని తేలిపోయిందని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాదులోని బీసీ జేఏసీ ప్రధాన కార్యాలయంలో ఈనెల 30న చలో హైదరాబాద్, బీసీల రాజకీయ యుద్ధభేరి సభకు సంబంధించిన సన్నాహాక సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో జాజుల శ్రీనివాస్‌గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. బీసీలకు చట్టబద్ధంగా ఇస్తామన్న 42  శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోగా, బీసీలను నమ్మించడానికి తమ పార్టీ పరంగా బీసీలకు 42 శాతం నుంచి 60 శాతం వరకు జనరల్ స్థానాల్లో కూడా అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్, బీజేపీ ప్రకటించాయని అన్నారు. కానీ ఆచరణలో అమలు చేయడానికి కనీస కసరత్తు కూడా ఆ పార్టీలు చేయడం లేదని ఆయన ఆరోపించారు.

రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం గతంలో తెచ్చిన జీవో నెంబర్ 9 ద్వారా బీసీలకు అవకాశం కల్పిస్తామన్న 5,300 సర్పం చు స్థానాలను కేటాయించాలని డిమాండ్ చేశారు. జీవో 9 ప్రకారం కూడా ఏ పార్టీ ప్రకటించడం లేదని, దీనిని బట్టి చూస్తే రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేయడానికి ప్రకటనలు గుప్పిస్తారు తప్ప ఆచరణలో మాత్రం శూన్యమన్నారు. అగ్రకుల రాజకీయ పార్టీల మోసాన్ని బీసీలు గ్రహిం చాలన్నారు.

బీసీలకు చట్టబద్ధంగా రావలసిన ఆరువేల గ్రామ పంచాయతీలు బీసీల వేనని, జనరల్ కోట అంటే అగ్రకులాలకు రిజర్వేషన్ కాదన్నారు. బీసీ రిజర్వేషన్లను గండి కొట్టి, బీసీ రిజర్వేషన్లకు రావలసిన గ్రామ సర్పంచ్ స్థానాలను జనరల్ గా మార్చారని పేర్కొన్నారు. అందుకే జనరల్ స్థానాలు కూడా బీసీలు కైవసం చేసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల బరిలో నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

జనరల్ స్థానాల్లో నిలబడిన బీసీలను గెలిపించుకునే బాధ్యత బీసీ సమాజం తీసుకుంటుందని చెప్పారు. బీసీల రాజ్యాధికారానికి సర్పంచుల సీటే ప్రాతిపదిక కావాలని ఆయన కోరారు.  ఎన్నికల షెడ్యూల్‌తో సంబంధం లేకుండా బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామన్నారు. ఇందులో భాగంగా ఈనెల 30న చలో హైదరాబాద్‌కు పిలుపునిస్తున్నామని తెలిపారు.

ఇందిరా పార్క్ వద్ద ఉదయం 10 గంటలకు బీసీల రాజకీయ యుద్ధభేరి మహాసభ నిర్వహిస్తున్నామని, రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీలంతా హైదరాబాదుకు పెద్ద ఎత్తున తరలివచ్చి, సభను విజయవంతం చేయాలని శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్‌చారి, కో చైర్మన్‌లు శేఖర్‌సగర, కాటేపల్లి వీరస్వామి, వైస్‌చైర్మన్ దీటి మల్లయ్య, కవుల జగన్నాథం, జుర్రిగల శ్రీనివాస్, పల్లపు సమ్మయ్య, జిల్లల నరసింహ, వెంకటేష్‌గౌడ్, గూడూరు భాస్కర్, నరసింహచారి తదితరులు పాల్గొన్నారు.