29-11-2025 12:56:04 AM
ఏర్గట్ల మండలం దోంచందలో ఘటన
ఈ నెల 6న ఆత్మహత్యాయత్నం
నిజామాబాద్, నవంబర్ 28 (విజయక్రాం తి): యువకుడి మృతదేహం ఉంచిన ఫ్రీజర్ బాక్స్‌ను పోలీస్ వాహనంపై కట్టేసి మృతుడి బంధువులు, గ్రామస్తులు ఆందోళనకు దిగిన ఘటన నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని దోంచందలో శుక్రవారం జరిగింది. దీంతో ఉద్రిక్త వాతావరణం నొలకొంది. కుటుంబీకుల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాదంలో మునిగిపోయింది. తను ప్రేమించిన యువతికి మరొకరితో పెళ్లి జరిగిందని మనస్థాపానికి గురైన ఓ యువకుడు ఈ నెల 6న ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలో యువకుడు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శుక్రవారం మృతి చెందాడు. దోంచంద గ్రామానికి చెందిన నాగిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి అనే యువకుడు (29), తను ప్రేమించిన అమ్మాయిని ఇతరులకు ఇచ్చి పెళ్లి చేశారని, తాను మోసపోయానని మనోవేదనతో ఈ నెల 6న విషం తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్సకు హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. దీంతో కొపోద్రిక్తులైన బంధువులు, గ్రామస్తులు యువకుడి మృతదేహంతో శుక్రవారం ఉదయం ఏర్గట్ల పోలీస్ స్టేషన్ ముట్టడికి యత్నించారు. పరిస్థితి ఉధృతంగా మారడంతో ఆందోళనకు దిగిన వారిని తాళ్లరాంపూర్ రోడ్డులో పోలీసులు అడ్డుకున్నారు. ఆగ్రహంతో బంధువులు మృతదేహాన్ని ఉంచిన ఫ్రీజర్‌ను పోలీస్ వాహనంపై పెట్టి కట్టేశారు. బాధితుడు కుటుంబానికి న్యాయం చేయాలంటూ రాస్తారోకో నిర్వహించారు.