భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా పటాన్‌చెరు
- ఉత్తర భారతీయులు తెలంగాణ వాసులే..
- త్వరలో సూర్య దేవాలయం, ఫంక్షన్ హాల్ పనులు పటాన్‌చెరు ఎమ్మెల్యే జీఎంఆర్
పటాన్చెరు, అక్టోబర్ 19 :మినీ ఇండియా గా పేరుందిన పటాన్చెరు నియోజకవర్గం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తోందని.. జీవనోపాధి కోసం దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి తరలి వచ్చి దశాబ్దాలుగా పటాన్చెరు నియోజకవర్గంలో నివసిస్తున్న ప్రజలందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటూ వారి ఆర్థిక అభ్యున్నతికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
ఆదివారం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని పాటి గ్రామ శివారులో గల ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఉత్తర భారతీయుల సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా దీపావళి పర దినం పురస్కరించుకొని ప్రతి ఏటా ఉత్తర భారతీయులు ఘనంగా నిర్వహించుకునే చట్ పూజ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి ప్రవేశించిన నాటి నుండి నేటి వరకు ఉత్తర భారతీయులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నామని తెలిపారు.
కార్మికులకు అండగా ఉంటా...
నియోజకవర్గంలోని వివిధ పరిశ్రమలలో కార్మికులుగా విధులు నిర్వర్తిస్తున్న ఉత్తర భారతీయులకు ఏదైనా ప్రమాదాలు సంభవించినప్పుడు యాజమాన్యాలతో చర్చించి మెరుగైన నష్టపరిహారాలు అందిస్తున్నామని తెలిపారు. పటాన్చెరు నియోజక వర్గంలోనే స్థిర నివాసం ఏర్పరచుకునేలా ప్రభుత్వ సంక్షేమ పథకాలలోనూ సముచిత ప్రాధాన్యత అందిస్తున్నామని తెలిపారు.
గతంలో హామీ ఇచ్చిన విధంగా అతి త్వరలో ఉత్తర భారతీయుల కోసం ఫంక్షన్ హాల్, సాకి చెరువు కట్టపైన సూర్యదేవుడి ఆలయం నిర్మించబోతున్నామని తెలిపారు. చట్ పూజా సందర్భంగా ఉచితంగా చెరుకు పంపిణీకి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే జీఎంఆర్‌ను సన్మానించారు.
జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ ఎంపీపీలు యాదగిరి యాదవ్, శ్రీశైలం యాదవ్, మాజీ జెడ్పిటిసి సుధాకర్‌రెడ్డి, బీడీఎల్ భానూరు సిఐ విజయ్ కృష్ణ, దశరథరెడ్డి, వెంకటరెడ్డి గూడెం మధుసూదన్‌రెడ్డి, పరమేష్ యాదవ్, రాజన్ సింగ్, రామచంద్రా రెడ్డి, సంఘం ప్రతినిధులు సంజయ్ సింగ్, నీరజ్, జై కిషన్, టింకు, రవికుమార్, దిలీప్ గుప్తా, బుగోల్, యోగేష్, పాండే, నరేందర్, పిం టూ సింగ్, దినోత్, చోబె, కృష్ణ పాల్గొన్నారు.






