17-06-2025 12:53:43 AM
-కీలక సాక్షిగా మహేశ్‌కుమార్‌గౌడ్ వాంగ్మూలం!
-నేడు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ వద్ద హాజరు
-2023 ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్‌కు గురైన మహేశ్‌గౌడ్
హైదరాడాద్ సిటీ బ్యూరో, జూన్ 16 (విజయక్రాంతి): తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీగా ఉన్న మహేశ్‌కుమార్‌గౌడ్ ఈ కేసులో సాక్షిగా మారబోతున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ వద్ద ఆయన తన వాంగ్మూలం ఇవ్వనున్నారు.
నవంబరు 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మహేశ్‌కుమార్‌గౌడ్ ఫోన్‌ను బీఆర్‌ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ప్రస్తుతం కొనసాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా జూబ్లీహిల్స్ పోలీసులు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను సాక్షిగా హాజరుకావాలని కోరారు.
పోలీసుల సూచన మేరకు మహేశ్‌కుమార్‌గౌడ్ మంగళవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి చేరుకుని తన వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. ఈ కేసులో ఆయన వాంగ్మూలం కీలక మలుపు తిప్పే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతుండగా, మహేశ్‌గౌడ్ వాంగ్మూలం కేసు విచారణకు మరింత బలాన్ని చేకూర్చనుంది.