23-11-2025 10:16:15 PM
కమీషన్లకు కక్కుర్తితో అప్పటి బీఆర్ఎస్ నాయకులు నాసిరకంతో నిర్మించారు..
మానేరు పరిశీలనలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు..
పెద్దపల్లి (విజయక్రాంతి): జిల్లాలోని ఓదెల మండలం గుంపుల గ్రామంలో మానేరుపై కట్టిన చెక్ డ్యామ్ నాసిరక నిర్మాణం కూలగా స్థానిక నాయకులతో, గ్రామస్తులతో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మానేరులో కాల్వ శ్రీరాంపూర్ మండలం మిర్జంపేట గ్రామంలో, ఓదెల మండలం గుంపుల, ఇందుర్తి, రూపు నారాయణపేట, పోత్కపల్లి, కొండపాక మధ్య, మడక కనగర్తి, సుల్తానాబాద్ మండలం తొగర్రాయి, నీరుకుల్ల చెక్ డ్యాములు నాసిరకంతో నిర్మించగా అవి కుప్పకూలాయి అన్నారు.
అదేవిధంగా హుస్సేన్ మియా వాగుపై కట్టిన చెక్ డ్యాములు కూడా కుప్పకూలాయని, ఇసుక లోతున మట్టి వచ్చే వరకు గుంత తీసి కంకరేసి చెక్ డ్యాములు నిర్మాణం చేపడితే ఆగుతాయని, బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ల జేబులు నింపుకునే కొరకు నాసిరకం చెక్ డ్యాములు నిర్మించారని విమర్శించారు. అందులో భాగంగా గుంపులలో కట్టిన చెక్ డ్యామ్ నాసిరకం వలెనే కూలిందని ఎలాంటి బ్లాస్టింగ్ జరగలేదన్నారు. సంబంధిత అధికారులు, పోలీసులు బ్లాస్టింగ్ విషయంపై ప్రత్యేకంగా ఆరా తీశారని, ఎక్కడ కూడా బ్లాస్టింగ్ జరగలేదని స్వయంగా పోలీసులే చెప్పడం జరిగిందన్నారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చెక్ డాం బ్లాస్టింగ్ చేశారని సంఘటనా స్థలానికి వచ్చి చూసి తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడని, మనోహర్ రెడ్డి హయాంలో మానేరు, హుస్సేన్ మియా వాగుపై కడుతున్న చెక్ డ్యాములను ఎప్పుడైనా వచ్చి పరిశీలించావని దాసరి మనోహర్ రెడ్డిని ఎమ్మెల్యే ప్రశ్నించారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉండగా అప్పటి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కమీషన్లకు కక్కుర్తి పడి నాణ్యత లేకుండా నాసిరకంగా చెక్ డ్యాములు నిర్మించారని, అందుకే చెక్ డ్యాములు కుప్పకూలుతున్నాయన్నారు. 10 చెక్ డ్యాములు కడితే ఇప్పటికి 8 చెక్ డ్యాములు కుప్పకూలాయని, బీఆర్ఎస్ అధికారంలో ఉండగా అప్పటి ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షణ లోపంతోనే నాసిరకం చెక్ డ్యాములు నిర్మించారన్నారు. గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ నాసిరకపు చెక్ డ్యాం లను సందర్శించడం జరిగిందని గుర్తు చేశారు. గుంపులలో ఎక్కడ కూడా బ్లాస్టింగ్ చేసినట్టు కనబడడం లేదని, నాసిరకం చెక్ డ్యామ్ కట్టించిన అప్పటి బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ బదనాం అయితామోనని ప్లాన్ ప్రకారం బ్లాస్టింగ్ చేశారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, చెక్ డ్యామ్ బ్లాస్టింగ్ జరిగితే కొంతైనా ఆనవాళ్లు ఉండాలని ఎక్కడ ఆనవాళ్లు కనిపించడం లేదని, అప్పటి ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణ లోపం, బీఆర్ఎస్ నాయకుల వైఫల్యమై అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.