calender_icon.png 12 December, 2025 | 10:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిటైర్డ్ బొగ్గు ఉద్యోగుల పెన్షన్ పెంచాలి

06-12-2025 12:00:00 AM

బొగ్గు ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత శేష జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా గడిపేందుకు స్వర్గీయ కాకా వెంకటస్వామి అప్పట్లో పెన్షన్ పథకం తెచ్చారు. అయితే. 27 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకూ ఈ పథకంపై మళ్లీ సమీక్ష సవరణ జరపకపోవడం వల్ల ఉద్యోగ విరమణ చేసిన రోజు నిర్ధారించిన పెన్షన్‌తోనే జీవితకాలమంతా గడపవలసి వస్తున్నది.

రోజురోజుకు అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతు న్నాయి. వైద్య ఖర్చులు కూడా ఆకాశాన్ని అంటు తున్నాయి. చాలీచాలని అతి తక్కువ పెన్షన్‌తో బతకడమే భారంగా మారుతున్నది. వంశీకృష్ణ పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన తర్వాత పెద్దపల్లి నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా అనేక అభివృద్ధి పనులను చేపడుతున్నారు. అదేవిధంగా పెద్దపల్లి మంచిర్యాల తదితర స్టేషన్లలో ముఖ్యమైన రైళ్లకు హాట్టులు ఏర్పాటు చేయించారు. వారి చిత్తశుద్ధి, అంకిత భావానికి ఇవి నిదర్శనం.

అంతేకాకుండా రామగుండం ప్రాంతంలో విమానాశ్రయాన్ని నెలకొ ల్పుటకు నిరంతరం కృషి చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానని వెంటనే వారి ఇళ్ల వద్దకు చేరుకొని కష్ట సుఖాలను తెలుసుకోవడమే కాదు ఆదుకుంటున్నారు కూడా. ఇదే స్పూర్తితో బొగ్గు ఉద్యోగుల పెన్షన్ పెంచుటకు ఎంపీ వంశీకృష్ణ కృషి చేస్తారని, కాకా వెంకటస్వామి వారసునిగా తాత అందించిన ప్రసాదాన్ని కదుపునిండా భోజనంగా విస్తరిస్తారని ఆశిస్తున్నాం. వారికి ఇదే మా విజ్ఞప్తి. ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో బొగ్గు ఉద్యోగుల పెన్షన్ పెంచుటకు వంశీ కృష్ణ ప్రభుత్వాన్ని ఒప్పించి ఒక ప్రకటన చేయిస్తారని దేశంలోని లక్షల మంది బొగ్గు రిటైర్డ్ ఉద్యోగులు వారిపై అత్యంత విశ్వాసంతో ఎదురు చూస్తున్నారు.

 రాంచందర్‌గౌడ్ , కరీంనగర్

మంచి సర్పంచ్‌లను ఎన్నుకోండి!

సర్పంచ్ ఎన్నికలతో పల్లె రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే సర్పంచ్, వార్డు మెంబర్లకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. కొన్నిచోట్ల ఏకగ్రీవ సర్పంచ్‌లుగా ఎన్నికవుతున్నారు. ఇంకొన్ని చోట్ల మాత్రం సర్పంచ్ ఎన్నికకు తీవ్ర పోటీ నెలకొంది. కాగా గ్రామాల్లో ఎన్నికయ్యే సర్పంచ్‌పైనే గ్రామాభివృద్ధి ఆధారపడి ఉంటుంది. గ్రామ ప్రథమ పౌరుడంటే ఇంటికి పెద్దదిక్కు. గ్రామ ప్రజలను తమ కుటుంబ సభ్యులుగా భావించి నిరంతరం వారి క్షేమం, సంక్షేమం, అభివృద్ధికి పాటుపడుతుండాలి.

అంతేకానీ ఏదో హోదా కోసమో ఆర్థికపరమైన వ్యాపారంగా భావించి లక్షల్లో ఖర్చుపెట్టి వడ్డీతో సహా సంపాదించుకోవాలనో ఎన్నికల్లో పోటీ చేయవద్దు. గ్రామ ప్రజలు సైతం పార్టీలు, కులాలు, మతాలకతీతంగా డబ్బుకు ఎలాంటి ప్రాధాన్యతనివ్వకుండా, సేవా దృక్పథంతో గ్రామాభివృద్ధికి పాటుపడే నాయకున్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో యువత కూడా పెద్ద ఎత్తున సర్పంచ్ పదవులకు పోటీ చేస్తుండడంతో పరిస్థితుల్లో ఏమైనా మార్పు వస్తుందేమోనని గ్రామ ఓటర్లు ఆశపడుతున్నారు. యువత కూడా గ్రామాల్లో ఏ సమస్యలు ఎక్కువగా ఉన్నాయో వాటిని ఒక పేపర్‌పై రాసుకుంటున్నారు. ప్రచారంలో భాగంగా తమను సర్పంచ్‌గా గెలిపిస్తే మొదటి ప్రాధాన్యత కింద సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇస్తున్నారు.

 అభిలాష్, సిద్దిపేట