calender_icon.png 12 December, 2025 | 8:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంధం బలోపేతం!

06-12-2025 12:00:00 AM

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసిందనడంలో సందేహం లేదు. శుక్రవారం ఢిల్లీ వేదికగా జరిగిన 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశానికి హాజరైన పుతిన్.. భారత్‌తో ఎల్లప్పుడూ స్నేహహస్తమే కొనసాగుతుందన్నారు. ఆయన వ్యాఖ్యలు.. రెండు దేశాల దీర్ఘకాలిక, వ్యూహాత్మక బంధానికి సంబంధించి కీలక పరిణామంగా చెప్పొచ్చు.

ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధాన్ని రష్యా ఆపాలంటూ అమెరికా సహా ప్రపంచ దేశాలంతా ఏకరువు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై తాము ఎప్పుడూ శాంతి పక్షమే ఉన్నామంటూ తరచూ చెప్పుకొచ్చిన భారత్.. తాజాగా పుతిన్ పర్యటన సందర్భంగానూ అదే మాటకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది. ప్రపంచాధినేతలు అనుకుంటున్నట్లుగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో తాము తటస్థంగా లేమని, భారత్‌కు ఒక స్పష్టమైన వైఖరి ఉందని, తమది ఎప్పుడూ శాంతి మార్గమేనని ప్రధాని మోదీ స్పష్టంగా తెలియజేశారు.

మరోవైపు ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యాపై కఠిన ఆంక్షలు విధించిన అమెరికా.. వారి నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై కూడా కఠిన ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. అయితే భారత్ మాత్రం అమెరికా ఆదేశాలను బేఖాతరు చేస్తూ చమురు సరఫరాను కొనసాగిస్తూనే వచ్చింది. ఈ అంశంపై పుతిన్ స్పందించారు. పశ్చిమ దేశాల నుంచి వస్తున్న ఒత్తిడుల కారణంగా కొంతకాలంగా చమురు దిగుమతులను భారత్ తగ్గించుకుందన్న మాట వాస్తవ మన్నారు. అయితే భారత్ అభివృద్ధికి సహకరించడం కోసం భవిష్యత్తులో ఇంధన సరఫరాను మరింత పెంచబోతున్నట్లు పుతిన్ చెప్పడం శుభపరిణామం.

ఉగ్రవాదంపై పోరుకు భారత్, రష్యా కలిసి నడుస్తాయని పుతిన్ పేర్కొన్నారు. ఇటీవల కాలంలో బ్రిక్స్ కూటమిపై ట్రంప్ గుర్రుగా ఉన్న నేపథ్యంలో బ్రిక్స్ అధ్యక్ష పదవిని భారత్ చేపడుతుందని పుతిన్ బహిరంగంగా పేర్కొన్నారు. దీంతో జి కూటమికి ధీటుగా బ్రిక్స్ కూటమిని మరింత బలోపేతం చేయాలన్న దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పొచ్చు. 1947లో భారత్, రష్యా మధ్య మొదలైన దౌత్య సంబంధాలు.. 2000 సంవత్సరంలో వ్యూహాత్మక భాగస్వామ్యంపై ప్రకటన, ఆ తర్వాత 2010లో బహుళ రంగాల సహకారాన్ని ప్రతిబింబిస్తూ ‘ప్రత్యేక, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యం’ అంశం ఇరు దేశాల మధ్య సంబంధం మరింత బలపడేలా చేసింది.

భారత్‌కు రెండో అతిపెద్ద ఆయుధ సరఫరాదారు రష్యా అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇరు దేశాల మధ్య ఆయుధాల సరఫరా కూడా నిర్విరామంగా కొనసాగుతుందని పుతిన్ తెలిపారు. ఇక 2024- ఆర్థిక సంవత్సరంలో భారత్ వాణిజ్యం 64 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం 100 బిలియన్ డాలర్లకు చేరుకోవడమే లక్ష్యంగా విజన్ 2030 డాక్యుమెంట్‌పై సంతకాలు చేశాయి.

కుడంకుళం ప్లాంట్ సహా భారతదేశ పౌర అణు కార్యక్రమంలో రష్యా కీలక పాత్ర పోషిస్తోంది. అంతిమంగా పుతిన్ పర్యటనను ఒక పటిష్టమైన వాణిజ్య బంధంగా పరిగణించవచ్చు. వాణిజ్యం, రక్షణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, వైద్యం, ఆరోగ్యం, ట్రావెలింగ్ తదితర రంగాల్లో రష్యా భారత్ మధ్య జరిగిన ద్వైపాక్షిక ఒప్పందాలు రెండు దేశాల బంధాన్ని మరింత పటిష్టం చేసినట్లయింది.