12-12-2025 01:21:27 AM
తెలంగాణ బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్
ప్రతిపక్ష పాత్ర పోషించడంలేదని చివాట్లు
పార్టీ ఎదిగేందుకు మంచి అవకాశాలు..
ఉపయోగించుకోవడంలోనే విఫలం సమిష్టిగా పనిచేయడంలో సమస్యలేంటని ఆగ్రహం
హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): తెలంగాణ బీజేపీ ఎంపీల పని తీరుపై ప్రధాని నరేంద్ర మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. మీ కంటే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ బెటర్ అని ఆగ్ర హం వ్యక్తం చేశారు. గురువారం ఢిల్లీలో తెలంగాణ, ఏపీ, అండమాన్ రాష్ట్రాల బీజే పీ ఎంపీలకు ప్రధాని అల్ఫాహార విందు ఇచ్చారు. దాదాపు 15 మంది ఎంపీలతో సుమారు 30 నిమిషాలు ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా టీమ్ కంటే కూడా అసదుద్ద్ధీన్ ఒవైసీ సోషల్ మీడియా టీమ్ యాక్టివ్‌గా పనిచేస్తోందన్న అభిప్రాయం వ్యక్తంచేశారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు సరైనా ప్రతిపక్ష పాత్రను పోషించడంలేదని ఆయన అసంతృప్తి వ్యక్తంచేసినట్లుగా తెలిసింది. రాష్ట్రంలో పార్టీ ఎందుకు వెనుకబడిందని నేతలకు ఆయన ప్రశ్నించారు. రాష్ర్టంలో పార్టీ మరింత క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, ప్రతిపక్ష పాత్రను మరింత బలంగా పోషించాలని బీజేపీ ఎంసీలకు సూచించారు.
తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరగడానికి మంచి అవకాశాలున్నా యి. మంచి టీమ్‌ను పెట్టుకుని సమర్థంగా ఎదుర్కోవడానికి సమస్య ఏమిటని మోదీ నిలదీశారు. అవకాశాలను ఉపయోగించుకోవడంలో నేతలు విఫలమవుతున్నారన్నారు. అందరూ సమిష్టిగా పనిచేయాలని గట్టిగానే క్లాస్ పీకారు. సోషల్ మీడియా రంగంలో కూడా తెలంగాణ బీజేపీ ఎంపీలు దృష్టిసారించాలని సూచించారు. డిజిటల్ వేదికల ద్వారా ప్రజలను ఆకట్టుకోవడంలో పార్టీ శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని అన్నా రు.
ప్రస్తుత కాలంలో సామాజిక మాధ్యమాలే ప్రజలకు చేరుకునే ప్రధాన వేదిక లుగా మారాయని, అందువల్ల ఈ రంగంపై మరింత దృష్టి పెట్టాలని ప్రధాని మోదీ నేతలకు సూచించారు. జాతీయ పరిణామాలపై యాక్టివ్‌గా ఉండాలని సూచించారు. పలు రాష్ట్రాల్లో పర్యటించి ఆయా అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేయాలని పార్టీ ఎంపీలకు మోదీ తెలిపారు. మంచి అవకాశాలున్న చోట ఎంపీలు విఫలమవుతున్నట్లు ఆయన అసహనం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. పార్టీ బలోపేతం విషయంలోనూ పెద్దగా దృష్టి పెట్టడంలేదని నేతలతో చెప్పినట్లుగా తెలిసింది.
ఏపీలో అద్భుత పాలన..
తెలంగాణ బీజేపీ ఎంపీలపైనే కాదు ఏపీ బీజేపీ ఎంపీలకు కూడా మోదీ పలు సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు అద్భుతమైన పాలన అందిస్తున్నారని ప్రధాని అభినందించారు. రాష్ర్టంలో కూటమి పార్టీలు సమన్వయంతో ముందుకు సాగుతున్న తీరు శుభపరిణామమని పేర్కొన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో బీజేపీ సమన్వయం బాగా కొనసాగుతుందని మోదీ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని పరిపాలనపై కూడా మంచి ఫీడ్ బ్యాగ్ వచ్చిందని వివరించారు. పెట్టుబడులు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు వెళ్తున్నాయని, ఇది అభివృద్ధికి నిదర్శనమని కితాబిచ్చినట్లుగా తెలిసింది.
జగన్‌కు దీటుగా కౌంటర్ ఇవ్వాలి..
ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంపీలకు సైతం మోడీ కీలక సూచనలు చేశారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌కు బీజేపీ ఎంపీలు దీటుగా కౌంటరివ్వాలని సూచించారు. వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలకు బీజేపీ వెనువెంటనే స్ట్రాంగ్ కౌంటరివ్వాలని వారికి దిశానిర్దేశం చేశారు. వైఎస్సార్‌సీపీపై ఇంకా దూకుడుగా వ్యవహరించాలని ఎంపీలకు మోదీ సూచించినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ వ్యవహారాలపై, ప్రజాసమస్యలపై వైసీపీని మరింత టార్గెట్ చేస్తూ పోరాడాలని ప్రధాని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల వినియోగంలో మరింత చురుకుదనం అవసరమని అన్నారు. మీడియా, సోషల్ మీడియా ద్వారానే ప్రజలకు, ముఖ్యంగా యువతకు వేగంగా చేరువయ్యే అవకాశం ఉండటంతో, బీజేపీ నాయకులు ఆ విషయంలో మరింత యాక్టివ్‌గా ఉండాలని సూచించారు.
విభేదాలు వీడండి..
తెలంగాణలో బీజేపీ నుంచి ఎనిమిది మంది ఎంపీలున్నారు. భవిష్యత్తులో పార్టీ ఎదిగేందుకు, అధికారం చేపట్టేందుకు అవకాశాలున్నాయని మోదీ చెప్పినట్లుగా తెలిసింది. అయితే నేతల మధ్య విభేదాలు ఉన్నట్లుగా మోడీ దృష్టికి వెళ్లడంతో పలువురి తీరుపై ఆయన ఫైర్ అయినట్లుగా తెలుస్తోంది. విభేదాలు పక్కన పెట్టాలని సూచించారు. పార్టీయే ముఖ్యమని, వ్యక్తిగత ఎజెండాలు పనిచేయవని వారితో అన్నట్లుగా సమాచారం.
నేతల మధ్య విభేదాలతో పార్టీకి చెడ్డపేరు తేవద్దని, ప్రజల్లో పలుచన కావొద్దని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే, మరోవైపు కేంద్రం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై ప్రజల్లో తీసుకెళ్లాలని ఎంపీలకు సూచించినట్లుగా తెలిసింది. పార్టీ కార్యక్రమాలు, సమావేశాల్లో సమిష్టిగా పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాలని దిశానిర్దేశం చేసినట్లగా సమాచారం.