23-07-2025 07:08:19 PM
జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్..
జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు, ప్రాణహిత నది పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తం..
అత్యవసరమైతే డయల్ 100, 8712670551 నెంబర్ ని సంప్రదించాలని సూచన..
జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ఎస్పీ వెల్లడి..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రాష్ట్రంలో వారం రోజుల పాటు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసినందున లోతట్టు ప్రాంతాలు, ప్రాణహిత నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్(SP Kantilal Patil) బుధవారం ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద ప్రవాహం ఉన్న వంతెనలు, కల్వర్ట్, రహదారులపై నుండి ప్రజలు దాటవద్దని, జలాశయాలు, చెరువులు, కుంటలను చూడడానికి వెళ్లకూడదని అన్నారు. శిధిల వ్యవస్థలో ఉన్న ఇండ్లలో నివాసం ఉండద్దని, తడిగా ఉన్న కరెంట్ పోల్స్ తాకవద్దని, గ్రామాలలో చేపల వేటకు ఎవరు వెళ్ళవద్దని, రైతులు పొలాల్లో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తలు వహించాలని, నీరు నిల్వ ఉన్న విద్యుత్ స్తంభాల దగ్గరికి వెళ్లరాదని, వాటర్ ఫాల్స్ లాంటి ప్రాంతాలను సందర్శించవద్దని తెలిపారు.
అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరు బయటకు రావద్దని, వరద ప్రవాహల వద్ద బందోబస్త్ ఉన్న పోలీస్ సిబ్బంది సూచనలు పాటించి పోలీసు వారికి సహకరించాలని సూచించారు. జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైన వాటిని ఎదుర్కొనేందుకు జిల్లా పోలీస్ శాఖ సంసిద్ధంగా ఉందని, ముంపు ప్రాంతాల ప్రజలకు తక్షణ సహాయం కోసం జిల్లా విపత్తు ప్రతిస్పందన దళాలు(DRDF) బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. జిల్లా పాలన యంత్రం, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, రెస్క్యూ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. విపత్కార పరిస్థితులు ఎదురైతే ప్రజలు పోలీస్ శాఖ సహాయం తీసుకోవాలని, డయల్ 100 లేదా 8712670551 నెంబర్ ని సంప్రదించాలని తెలిపారు. జిల్లాలో ఎలాంటి ప్రమాదాలు వాటిల్లకుండా పోలీసులు చేపట్టే చర్యలకు ప్రజలు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.