26-09-2025 08:28:07 PM
గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక లో ఉన్నది
ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వండి
క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి
అధికారులు,సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలి
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్
ములుగు,(విజయక్రాంతి): నేడు, రేపు రెండు రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల నేపధ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.భారీ వర్ష సూచనల నేపథ్యంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా, సమర్ధవంతంగా ఎదుర్కొనేలా అన్ని విధాలుగా సన్నద్ధం అయి ఉండాలని సూచించారు.
ఎక్కడ కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, మూగ జీవాలు ప్రాణాలు కోల్పోకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అధికారులు, సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో విధుల్లో ఉంటూ, అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం యావత్తు అండగా ఉందనే భరోసాను ప్రజలకు కల్పించాలని హితవు పలికారు. ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్, వైద్యారోగ్య, ఇరిగేషన్, విద్యుత్, పంచాయతీ రాజ్, రోడ్లు-భవనాల శాఖలు, విపత్తు నిర్వహణ సంస్థలు రాబోయే రెండు రోజుల పాటు అప్రమత్తంగా ఉంటూ, క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే వెంటనే సమాచారం అందించాలన్నారు.
ప్రజలు అత్యవసర పరిస్థితులు ఏర్పడితే కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించవచ్చని కలెక్టర్ సూచించారు. ప్రజలు కూడా ఎవరికి వారు అప్రమత్తంగా ఉంటూ, తగు జాగ్రత్తలు పాటించాలని హితవు పలికారు. లోతట్టు ప్రాంతాలు, నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. ఆయా శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పని చేస్తూ, జిల్లాలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తతతో వ్యవహరించాలని అన్నారు. విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు. లో లెవెల్ వంతెనలు, కాజ్ వేల మీదుగా వరద ప్రవాహం ఉన్న సమయాలలో రాకపోకలను నిషేధించాలని,చెరువులు, కాలువలు, నదులలో చేపల వేట, ఈత కోసం ఎవరూ వెళ్ళకుండా కట్టడి చేయాలన్నారు.
భారీ వర్షాల వల్ల చెరువులు, కాలువ కట్టలు తెగి పోకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని హితవు పలికారు. భారీ వర్షాలు, ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు, వైర్లు తెగిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు కూలిపోవడం వంటివి చోటుచేసుకున్న సందర్భాలలో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా రోడ్లు తెగిపోవడం వంటివి జరిగితే, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ట్రాఫిక్ మళ్లింపు చేపట్టి రాకపోకలను పునరుద్ధరించాలని, జనజీవనం స్తంభించిపోకుండా, ప్రజలకు అసౌకర్యం కలుగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, దారిమళ్ళింపు చర్యలలో పోలీసు అధికారులు, సిబ్బంది క్రియాశీలంగా పాల్గొనాలని సూచించారు.
పురాతన, శిథిలావస్థకు చేరిన భవనాలలో ఉంటున్న వారిని వెంటనే ఖాళీ చేయించాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలన్నారు. పునరావాస కేంద్రాలను ముందుగానే గుర్తిస్తూ, అవసరమైన సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను అక్కడికి తరలించి ఆహారం, ఇతర సదుపాయాలు సమకూర్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. భారీ వర్షాలతో వరద జలాలు ఏర్పడి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని పీహెచ్సీలు, ఆసుపత్రులలో సరిపడా మందుల స్టాక్ ను అందుబాటులో పెట్టుకుని, వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా పర్యవేక్షణ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి ఆదేశించారు.
భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా అప్రమత్తమై ఉన్నదని, ఎలాంటి పరిస్థితులు తలెత్తిన సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని, ప్రజలు ఆందోళనకు గురి కావద్దని కలెక్టర్ తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా తక్షణ సహాయం కొరకు కలెక్టరేట్ టోల్ ఫ్రీ నెంబర్ 18004257109కు కంట్రోల్ రూమ్‌లో 24 గంటలు అధికారులు, సిబ్బంది షిఫ్టుల వారిగా అందుబాటులో ఉంటూ, వర్షానికి, జలమాయమైయ్యే ప్రాంతాల సమస్యకు సంబంధించిన ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత శాఖల అధికారులను తక్షణ పరిష్కార నిమిత్తం పంపడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.