calender_icon.png 13 November, 2025 | 11:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిబంధనల మేరకే ఇసుక రవాణాకు అనుమతులు ఇవ్వాలి

13-11-2025 10:18:28 PM

జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్..

నారాయణపేట (విజయక్రాంతి): జిల్లాలో గుర్తించిన ప్రాంతాలలో నిబంధనల మేరకే ఇసుక రవాణాకు అనుమతులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. గురువారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో కలెక్టర్ అధ్యక్షతన  డి.ఎల్.ఎస్.సి( డిస్టిక్ లెవెల్ స్యాoడ్ కమిటీ) సమావేశం ఏర్పాటు చేశారు. మాగనూర్ మండలం గజరాన్ దొడ్డి గ్రామానికి చెందిన రైతు పట్టా భూమిలో దాదాపు 7743 క్యూబిక్ మీటర్ల ఇసుకను తొలగించాలని దరఖాస్తు చేసుకోగా గురువారం నాటి సమావేశంలో ఆ అంశంపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ చర్చించారు. ఇసుక తరలింపు విషయంలో మైనింగ్, రెవెన్యూ, భూగర్భ జల శాఖ, సర్వే ల్యాండ్, నీటి పారుదల, వ్యవసాయ శాఖల అధికారుల నివేదికలు, అభిప్రాయాలను ఆమె అడిగి తెలుసుకున్నారు.

సమావేశంలో మైనింగ్ ఏడి గోవింద రాజు మాట్లాడుతూ ఆయా శాఖల అధికారులు ఇచ్చిన నివేదికలన్ని సరిగ్గా ఉన్నాయని, దరఖాస్తుదారుని పట్టా భూముల నుంచి ఇసుక తొలగించేందుకు అనుమతులు ఇవ్వచ్చని  అభిప్రాయం వ్యక్తం చేశారు. అన్ని శాఖల అధికారులు రిపోర్టుల ఆధారంగా అనుమతికి కలెక్టర్ అంగీకారం తెలిపారు. అయితే టీజీఎండీసి ద్వారా ఆయా భూములలో ఉన్న ఇసుకను తరలించేందుకు ఎన్ని వాహనాలు అవసరమవుతాయని, ఎన్ని రోజుల సమయం పడుతుందని అధికారులతో చర్చించారు. ఇసుక తీసుకొని తరలించే ప్రాంతాలలో సీసీ కెమెరాలు, వాహనాలకు జిపిఎస్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ఆ ఇసుకను జిల్లాలో జరుగుతున్న వివిధ అభివృద్ధి నిర్మాణ పనులకు వినియోగించాలని ఆమె తెలిపారు.

అయితే రెవిన్యూ, నీటిపారుదల శాఖ, పంచాయతీ కార్యదర్శులతో కలిపి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటుచేసి ఇసుక తరలింపుపై పర్యవేక్షణ చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. ఒకవేళ రాత్రి వేళల్లో ఇసుక తరలిస్తున్నారని ఒక్క ఫోన్ తనకు వచ్చినా.. ఇచ్చిన అనుమతులన్ని రద్దు చేస్తానని, ఇక ముందు ఎలాంటి అనుమతులు ఇవ్వనని కలెక్టర్ తేల్చి చెప్పారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, మైనింగ్ రాయల్టీ అధికారి ప్రతాప్ రెడ్డి, డీ.టీ లు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు జరిగిన సమావేశంలో  కొడంగల్ నియోజక వర్గంలోని కోస్గి, కొత్తపల్లి, గుండుమల్, మద్దూరు మండలాల్లో పీ ఆర్, అర్ అండ్ బి, పాఠశాలలు, కళాశాలలు, బీటీ రోడ్లు, వసతి గృహాల నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక, అలాగే జిల్లా కేంద్రంలోని అప్పక్ పల్లి జిల్లా ఆసుపత్రి పక్కన నిర్మిస్తున్న నర్సింగ్ కాలేజీ భవన నిర్మాణానికి, ఎం.సీ. హెచ్ (మదర్ అండ్ చైల్డ్ హెల్త్ సెంటర్) భవన నిర్మాణానికి ఎంత ఇసుక అవసరం అనే విషయమై కలెక్టర్, అదనపు కలెక్టర్ సంబంధిత అధికారుల నుంచి వివరాలను తీసుకున్నారు.