19-12-2025 01:34:25 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 18 (విజయక్రాంతి): రాష్ట్రాన్ని కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు కస్టడీ విచారణ గురువారంతో ముగియగా.. అదే రోజు రాత్రి డీజీపీ శివధర్‌రెడ్డి కొత్త సిట్ ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశా రు. దర్యాప్తును మరింత వేగవంతం చేసేందుకు, కేసును కొలిక్కి తెచ్చేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో ఈ కొత్త సిట్‌ను ఏర్పాటు చేశారు.
ఇప్పటివరకు జరిగిన విచారణ ఒక ఎత్తుతై.. ఇకపై జరగబోయేది మరో ఎత్తు అన్నట్లుగా కొత్త సిట్ కూర్పు ఉంది. సీపీ సజ్జనార్ సారథ్యం లో ఏర్పాటైన ఈ బృందంలో అత్యంత సమర్థులైన సీనియర్ ఐపీఎస్ అధికారులకు చోటు కల్పించారు. రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా, సిద్దిపేట సీపీ ఎస్‌ఎం విజయ్ కుమార్, మాదాపూర్ డీసీపీ రితురాజ్, మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ రవీందర్‌రెడ్డి, రాజేంద్రనగర్ అదనపు డీసీపీ కేఎస్ రావు, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి, టీజీ న్యాబ్ డీఎస్పీ శ్రీధర్, హైదరాబాద్ మెట్రోలో పనిచేస్తున్న నాగేందర్ ఉన్నారు. వీరంతా గతంలో క్లిష్టమైన కేసులను ఛేదించడంలో పేరుగాంచిన వారు కావడం గమనార్హం.