calender_icon.png 19 December, 2025 | 9:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అస్తవ్యస్తంగా డీలిమిటేషన్!

19-12-2025 01:23:38 AM

  1. ఒక డివిజన్ లో ఎక్కువ, మరో డివిజన్‌లో తక్కువ ఓటర్లు

2011 జనాభా పరిగణలోకి తీసుకోవడంతో శివారు ప్రాంతాలకు అన్యాయం 

కొన్నిచోట్ల నాయకుల డైరెక్షన్ లో డివిజన్ల ఏర్పాటు 

ప్రజల నుంచి అభ్యంతరాల వెల్లువ

మేడ్చల్, డిసెంబర్ 18 (విజయ క్రాంతి): జిహెచ్‌ఎంసి డివిజన్ ల డిలిమిటేషన్ పై మేడ్చల్ జిల్లాలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా యి. ఒక విధానం అంటూ లేకుండా డిలిమిటేషన్ చేయడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. కొన్ని డివిజన్ లలో ఎక్కువ జనాభా, మరికొన్ని డివిజన్ లలో తక్కువ జనాభా ఉండడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలోని ఏదులాబాద్ డివిజన్ లో కేవలం 18 వేల ఓటర్లు మాత్రమే ఉన్నారు.

ఇందులో కేవలం 6 గ్రామాలు మాత్రమే ఉన్నాయి. సమీపంలో పోచారం డివిజన్ లో 70 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఈ డివిజన్ పరిధిలో అపార్ట్మెంట్లు ఎక్కువగా ఉన్నాయి. అపార్ట్మెంట్ లతోపాటు 2 బి హెచ్ కె సముదాయం త్వరలో అందుబాటులోకి రానున్నాయి. వీటివల్ల సుమారు 10 నుంచి 20 వేల ఓట్లు పెరగనున్నాయి. అలాగే నాగారం మున్సిపాలిటీ మొత్తం ఒకటే డివిజన్ ఏర్పాటు చేశారు.

ఇందులో సుమారు 70000 మంది ఓటర్లు ఉన్నారు. సాధారణంగా ప్రధాన రోడ్లకు ఒకవైపు ఒక డివిజన్, మరోవైపు రెండో డివిజన్ ఏర్పాటు చేస్తారు. బోడుప్పల్లో రెండు డివిజన్లు ఏర్పాటు చేశారు. రోడ్డుకు ఒకవైపు ఒకటి డివిజన్ మరోవైపు రెండో డివిజన్ ఏర్పాటు చేయాలి. కానీ అలా చేయకుండా జిగ్ జాగ్ గా రోడ్డుకు అటువైపు ఇటువైపు ఒకదానిలోకి మరొకటి ఏర్పాటు చేశారు. 

విధానం లేకుండా డివిజన్ ల ఏర్పాటు 

డివిజన్ ల ఏర్పాటుకు ఏ విధానం పాటించారో అర్థం కావడం లేదు. భౌగోళిక పరిస్థితి, జనాభా, ఇంటి నంబర్లు తదితర విధానాలలో  ఏది పాటించలేదు. రాత్రికి రాత్రే డివిజన్లు ఏర్పాటు చేశారు. ప్రజల అభిప్రాయం కూడా తీసుకోలేదు. డివిజన్ ఏర్పాటు చేసిన తర్వాత అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. సాధారణంగా  డిలిమిటేషన్ లో డివిజన్ లు ఈశాన్యం నుంచి ప్రారంభిస్తారు. ఉల్లి పోర తరహాలో పట్టణ శివారు ప్రాంతాలు రౌండ్ గా డివిజన్లు ఏర్పాటు చేస్తారు. రెండో లేయర్లు మరికొన్ని డివిజన్ లు ఏర్పాటు చేస్తారు. ఇలా చివరలో పట్టణం మధ్యలో ఏర్పాటు చేస్తారు.

ఈశాన్యంలో కీసర నుంచి ప్రారంభించినా ఉల్లి పోర మాదిరి డివిజన్లు ఏర్పాటు చేయలేదు. కీసర నుంచి ప్రారంభించి తూముకుంటలో ముగించారు. ఇలా కాకుండా  కీసరలో ప్రారంభించి తూముకుంటలో మొదటి వరస పూర్తి కావాలి. ఆ తర్వాత నాగారం నుంచి రెండో లేయర్ ప్రారంభం కావాలి. గతంలో మున్సిపాలిటీల డి లిమిటేషన్ రాష్ట్రవ్యాప్తంగా అన్నింటిలో ఇలాగే చేశారు. 

2011 జనాభా లెక్కల ఆధారంతో ఏర్పాటుతో శివారు ప్రాంతాలకు అన్యాయం 

2011 జనాభా లెక్కల ఆధారంగా డీ లిమిటేషన్ చేశామని అధికారులు చెబుతున్నారు. దీనివ ల్ల శివారు మున్సిపాలిటీలకు అన్యాయం జరిగింది. 2011లో శివారు మున్సిపాలిటీల జనాభా తక్కువగా ఉంది. ఆ తర్వాత 15 ఏళ్లలో జనాభా అనూహ్యంగా పెరిగింది. జిల్లాల నుంచి శివారు ప్రాంతాలలో కు వచ్చి నివసిస్తున్నారు. దీంతో జనాభా బాగా పెరిగింది. సిటీ మధ్యలో జనాభా అంతగా పెరగలేదు.

అప్పటి జనాభా లెక్కలు తీసుకోవడం వల్ల సిటీ మధ్యలో ఎక్కువ డివిజన్ లు ఏర్పాటు అయ్యాయి. మేడ్చల్ నియోజకవర్గం లో సుమారు 7 లక్షల మంది ఓటర్లు ఉండగా 16 డివిజన్ లు ఏర్పాటు చేశారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో సుమారు మూడు లక్షల మంది ఓటర్లు ఉండగా కొత్తగా మూడు డివిజన్లు ఏర్పాటు చేయడంతో 10 డివిజన్లకు పెరిగాయి. ఈ లెక్కన మేడ్చల్ నియోజకవర్గంలో 22 డివిజన్లకు పైన ఏర్పాటు కావాలి. వార్డుల డీలిమిటేషన్ శాస్త్రీయంగా చేయకపోవడం వల్ల తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. 

డివిజన్ పేర్ల లొల్లి 

డివిజన్ పేర్లపై కూడా చాలా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. కొత్తగా ఏర్పాటైన డివిజన్ ల పేర్లు పాపులర్ అయిన కాలనీల పేర్లు, ప్రాంతాల పేర్లు పెడితే బాగుండేది. అలాకాకుండా చిన్నచిన్న కాలనీల పేర్లు పెట్టడంతో మిగతా ప్రాంతాల వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.