calender_icon.png 19 December, 2025 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ శివారులోని ఆ భూమి అటవీ శాఖదే!

19-12-2025 01:37:15 AM

103 ఎకరాల భూమి ప్రైవేట్ వ్యక్తులది కాదు

  1. సాహెబ్‌నగర్ పరిధిలో ఉన్న రూ.4 వేల కోట్ల విలువైన భూమిపై ‘సుప్రీం’ తీర్పు
  2. 8 వారాల్లోగా రిజర్వ్ ఫారెస్ట్‌గా నోటిఫై చేయాలని సీఎస్‌కు ఆదేశం
  3. నిజాం, సాలార్జంగ్, మీర్ ఆలం వారసులమంటూ ప్రైవేట్ వ్యక్తులు వేసిన పిటిషన్లు కొట్టివేత
  4. వారికి అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పూ రద్దు

హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 18 (విజయక్రాంతి): హైదరా బాద్ శివారులోని అత్యంత ఖరీదైన భూ వివాదానికి భారత సర్వోన్నత న్యాయస్థానం తెరదించింది. వనస్థలిపురం, సాహెబ్ నగర్ పరిధిలో ఉన్న సుమారు రూ. 4 వేల కోట్ల విలువైన భూమిపై నెలకొన్న వివాదంలో తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో భారీ విజయం లభించింది. వివాదాస్పదంగా ఉన్న 103 ఎకరాల భూమి ప్రైవేట్ వ్యక్తులది కాదని, అది పూర్తిగా అటవీ శాఖకే చెందుతుందని సుప్రీంకోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది.

ఈ మేరకు ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. సాహెబ్‌నగర్ పరిధిలోని 102 ఎకరాల పైచిలు కు భూమిపై గత కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. తాము నిజాం, సాలార్జంగ్, మీర్ ఆలం బహదూర్ వారసులమని, ఈ భూమి తమకే చెందుతుందని పేర్కొంటూ సుమారు 260 మంది గతంలో హైకోర్టును ఆశ్రయించారు. వీరి వాదనలను విన్న హైకోర్టు అప్పట్లో పిటిషనర్లకు అనుకూలంగా తీర్పునిచ్చింది.

దీంతో విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయ్యే పరిస్థితి ఏర్పడింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. అది అటవీ భూమి అని, నోటిఫై చేసిన అటవీ భూములపై ఆలస్యంగా ప్రైవేట్ హక్కులను కోరడం చట్టవిరుద్ధమని ప్రభుత్వం గట్టిగా వాదించింది. ఈ కేసును జస్టిస్ పంకజ్ మిఠాల్, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది.

సాహెబ్ నగర్ భూములపై ప్రభుత్వ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. నిజాం వారసులమంటూ దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది. గురువారం వెలువడిన ఈ తుది తీర్పులో సుప్రీంకోర్టు రాష్ర్ట ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ‘ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పు చెల్లదు.

సదరు 103 ఎకరాల భూమి అటవీ శాఖకే చెందుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 48ఏ, 51ఏజి ప్రకారం అటవీ సంపదను రక్షించడం ప్రభుత్వ బాధ్యత. ఈ భూమిని అధికారికంగా రిజర్వ్ ఫారెస్ట్‌గా గుర్తిస్తూ, రాబోయే 8 వారాల్లోగా నోటిఫికేషన్ జారీ చేయాలి’ అని రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

నేషనల్ పార్క్ భూ ఆక్రమణలపై సీరియస్ 

మరోవైపు, వనస్థలిపురం నేషనల్ పార్క్ పరిసర ప్రాంతాల్లో భూ ఆక్రమణలపై కూడా కోర్టు సీరియస్ అయింది. ఈ సందర్భంగా రాష్ర్టవ్యాప్తంగా అటవీ భూముల పరిరక్షణకు జిల్లా స్థాయి ‘ప్రత్యేక విచారణ బృందాలను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కలెక్టర్ నేతృత్వంలో డీఎఫ్‌ఓ, అదనపు కలెక్టర్లు సభ్యులుగా ఉండే ఈ సిట్ బృందాలు.. అన్యాక్రాంతమైన భూములను గుర్తించనున్నాయి. అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు.. కానీ పర్యావరణాన్ని దెబ్బతీస్తే ఊరుకోం అని ధర్మాసనం హెచ్చరించింది.