13-12-2025 12:50:43 AM
సిట్ ఎదుట లొంగిపోయిన ఐపీఎస్ ప్రభాకర్‌రావు
హైదరాబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 12 (విజయక్రాంతి) : తెలంగాణ రాజకీయ యవనికపై పెనుసంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం క్లుమైక్స్‌కు చేరుకుంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, న్యాయమూర్తుల ఫోన్లను అక్ర మంగా ట్యాప్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో ప్రధాన నిందితుడు (ఏ1), రాష్ర్ట ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ టీ ప్రభాకర్ రావు ఎట్టకేలకు చట్టం ముందు తలవంచారు.
అనారోగ్య కారణాలతో ఇటీవలి వరకు అమెరికాలో ఉంటూ దర్యాప్తు నకు దూరంగా ఉన్న ఆయన.. సుప్రీంకోర్టు సీరియస్ ఆదేశాల మేరకు శుక్రవా రం ఉదయం 11 గంటల సమయంలో హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, సిట్ అధికారుల ఎదు ట బేషరతుగా లొంగిపోయారు. ప్రభాకర్‌రావు లొంగిపోయిన వెంటనే సిట్ అధి కారులు ఆయనను అధికారికంగా అరెస్ట్ చేశారు.
ఉస్మానియా ఆసుపత్రి వైద్యులతో ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో కీలక సమాచారం రాబ ట్టాల్సి ఉన్నందున నిందితుడిని తమకు అప్పగించాలని సిట్ కోరింది. దీనిని పరిశీలించిన న్యాయస్థానం.. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రభాకర్ రావును వారంరోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
షరతులతో కూడిన విచారణ..
ప్రభాకర్‌రావు వయసు, ఆయన క్యాన్సర్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు మానవతా దృక్పథంతో కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. సిట్ విచారణ ఈ షరతులకు లోబడే జరగనుంది. విచారణ పేరుతో నిందితుడిని శారీరకంగా హింసించకూడదు. ఆయనకు భౌతికంగా ఎలాంటి హాని తలపెట్టవద్దు. ఆరోగ్య కారణాల రీత్యా ఆయనకు ఇంటి నుంచి తెచ్చిన భోజనం, అవసరమైన మందులు అందించేందుకు అనుమతి ఉంది. విచారణ సమయంలో ఆయన న్యాయవాది కంటికి కనిపించే దూరంలో ఉండొచ్చు, కానీ వారి సంభాషణ వినిపించేంత దగ్గరగా ఉండకూడదు. చట్టప్రకారం, గౌరవప్రదంగా విచారణ జరిపి, వారంరోజుల తర్వాత నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
సిట్ క్వశ్చన్ బ్యాంక్..
ప్రభాకర్‌రావు కస్టడీకి రావడంతో సిట్ అధికారులు ఆయన కోసం ప్రత్యేక ప్రశ్నావళిని సిద్ధంచేశారు. ప్రధానంగా ఐదు అంశాలపై ఆయనను ప్రశ్నించనున్నారు.
1. ఫోన్ ట్యాపింగ్‌పై ఆదేశాలు ఎవరివి..? ఎస్‌ఐబీ చీఫ్‌గా ఉన్నప్పుడు కేవలం శాంతిభద్రతల కోసమే కాకుండా.. రాజకీయ ప్రత్యర్థులపై నిఘా పెట్టమని ఎవరు ఆదేశించారు..? అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశించారా.. లేక మరెవరైనా ఆదేశాలిచ్చారా..?
2. గతంలో అరెస్టయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు తన రిమాండ్ రిపోర్టులో బీఆర్‌ఎస్ సుప్రీం ఆదేశాల మేరకే తాము పనిచేశామని పేర్కొన్నారు. ఆ సుప్రీం ఎవరన్నది ప్రభాకర్ రావు నోట వెలువడాల్సి ఉంది.
3. 2023 డిసెంబర్ 4న ఎన్నికల ఫలితాలు వస్తున్న సమయంలో.. ఎస్‌ఐబీ ఆఫీసులోని హార్డ్ డిస్క్‌లు, సర్వర్లను కట్టర్లతో ధ్వంసం చేసి మూసీలో పారేయమని ప్రణీత్‌రావుకు ఎవరు చెప్పారు..?
4. దర్యాప్తుకు కీలకమైన తన ఐఫోన్ ఐ-క్లౌడ్ పాస్‌వర్డ్‌లను ప్రభాకర్‌రావు మార్చేశారని సిట్ ఆరోపిస్తోంది. ఇప్పుడు ఆ పాస్‌వర్డ్‌లను సేకరించి డేటాను రిట్రీవ్ చేయడం సిట్ ముందున్న పెద్ద సవాలు.
5. ఫోన్ ట్యాపింగ్ సమాచారంతో వ్యాపారవేత్తలను బెదిరించి వసూళ్లకు పాల్పడ్డారా.. ఆ నగదును ఎన్నికల్లో వాడారా..?
ప్రభాకర్‌రావు వాంగ్మూలం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకం కానుంది. ఆయన గనక అప్పటి ప్రభుత్వ పెద్దల పేర్లను బయటపెడితే.. బీఆర్‌ఎస్ పార్టీకి, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబానికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. మరోవైపు, ఈ కేసును ఓ కొలిక్కి తెచ్చి దోషులను శిక్షించాలన్న పట్టుదలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వారం రోజుల విచారణలో ఎలాంటి సంచలనాలు బయటపడతాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.