30-12-2025 12:00:00 AM
గచ్చిబౌలిలో దుర్మార్గం
ఏఐతో అసభ్య మార్ఫింగ్.. యువతి అప్రమత్తతతో నిందితుడి గుట్టురట్టు
శేరిలింగంపల్లి, డిసెంబర్ 29(విజయక్రాంతి): ఏఐ ఆధారిత యాప్లను ఉపయో గించి మహిళల చిత్రాలను మార్ఫిం గ్ చేస్తూ దుర్వినియోగానికి పాల్పడుతున్న ఓ వ్యక్తిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు అరెస్టు చేశారు. బీహెచ్‌ఈఎల్ ఎంఐజీ కాలనీకి చెందిన షాహిర్ శ్రీకాంత్ ఈ నేరానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. గౌలిదొడ్డి ప్రాంతంలోని పీజీ హాస్టల్లో నివసించే యువ తి శనివారం రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో బయటకు వచ్చిన వేళ నిందితుడు రహస్యంగా సెల్‌ఫోన్‌తో ఆమె ఫోటో లు తీయడం ప్రారంభించాడు. ఇది గమనించిన యువతి వెంటనే అతడిని నిలదీయగా, అతడి సమాధానాల్లో స్పష్టత లేకపోవడంతో అనుమానం బలపడింది.
దీంతో అతడి ఫోన్ ను తనిఖీ చేయగా, తన ఫోటోలతో పాటు వందలాది మంది మహిళల చిత్రాలు అందు లో భద్రపరచి ఉండటం, వాటిలో కొన్ని ఏఐ సాయంతో అసభ్యంగా మార్ఫింగ్ చేసినట్లు గుర్తించి ఆమె దిగ్భ్రాంతికి గురైంది. స్థానికుల సహకారంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించడంతో ఈ డీపీ ఫేక్ దుర్వినియోగం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడి మొబైల్లో లభించిన వందల ఫోటోలు పరిస్థితి తీవ్రతను స్పష్టంగా చూపిస్తున్నాయని తెలిపారు. నిందితుడి మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్లు, అతనిపై ఐటి చట్టం, మహిళల వేధింపుల నిరోధక చట్టాల కింద కేసులు నమోదు చేశారు.