29-10-2025 06:30:51 PM
మొక్కలు నాటి, పోస్టర్లను ఆవిష్కరించిన అధికారులు..
మేడిపల్లి (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెట్ షీకా గోయల్ ఆదేశానుసారం, బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని శాంతి వనంలో అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. హైదరాబాద్ రూరల్ యూనిట్, రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఆఫీసర్ పాల్వాయి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ నిధికి ఎటువంటి నష్టం జరగకుండా చూసే బాధ్యత ప్రతి ఒక్కరు పైన ఉందని, ప్రభుత్వ అధికారులు నిబద్ధత, నిజాయితీతో, పనిచేయాలని, ప్రజల సమస్యలను విజిలెన్స్ శాఖ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అటవీ అధికారి ఎం వేణుమాధవ్ మాట్లాడుతూ, ప్రజలలో విజిలెన్స్ పట్ల అవగాహన పెంపొందించాలని, ప్రజలందరూ అటవీశాఖకు సహకరించాలని, ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ పనులు విజయవంతంగా జరుగుతాయని తెలిపారు. బోడుప్పల్ మున్సిపల్ కమిషనర్ శైలజ మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని, ప్రజలు తమ సామాజిక బాధ్యతను తెలుసుకొని మెలగాలని సూచించారు. శాంతివనంకు వచ్చిన వాకర్స్, అటవీ శాఖ అధికారులు, బోడుప్పల్ మున్సిపాలటీ సిబ్బంది తో కలిసి పోస్టర్లను ఆవిష్కరించి, ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మున్సిపల్ కమిషనర్ శైలజ, కీసర ఫారెస్ట్ రేంజ్ అధికారి జే విష్ణువర్ధన్ రావు, ఉప్పల్ ఫారెస్ట్ రేంజ్ అధికారి శరత్ చంద్ర, విజిలెన్స్ అధికారులు ,బోడుప్పల్ మున్సిపల్ సిబ్బంది, వాకర్స్, తదితరులు పాల్గొన్నారు.