15-12-2025 05:10:27 PM
పాల్వంచ, (విజయక్రాంతి): కిన్నెరసాని గిరిజన గురుకుల పాఠశాల స్థాపించి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సోమవారం కిన్నెరసాని గిరిజన గురుకుల పాఠశాల ప్రాంగణంలో ప్రణాళిక సమావేశం నిర్వహించారు. 1975 సంవత్సరంలో ప్రత్యేకంగా గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధి లక్ష్యంగా, రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా ఆదర్శవంతమైన గురుకుల విద్యా విధానంతో, అద్భుతమైన అటవీ క్షేత్ర ప్రాంతమైన కిన్నెరసానిలో ఈ పాఠశాల స్థాపించబడింది. పేద, బడుగు, గిరిజన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే దూరదృష్టితో అప్పటి విద్యావేత్తలు ఈ విద్యాసంస్థను ప్రారంభించారు.
ఈ గురుకుల పాఠశాల నుంచి ఇప్పటివరకు 40 బ్యాచ్‌ల టెన్త్ తరగతి విద్యార్థులు ఉత్తీర్ణులై సమాజంలోకి అడుగుపెట్టారు. ఇక్కడ చదువుకున్న గిరిజన విద్యార్థులతో పాటు ఇతర వర్గాల విద్యార్థులు కూడా ఉపాధ్యాయులు, డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, పత్రికారంగ నిపుణులు, స్వయం ఉపాధి వ్యాపారవేత్తలు, వ్యవసాయ రంగంలో స్థిరపడిన రైతులుగా సమాజానికి విశేష సేవలందిస్తున్నారు. వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకొని సమాజ ప్రగతికి దోహదపడుతున్నారు. ఈ చారిత్రాత్మకమైన 50 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
ఈ స్వర్ణోత్సవాలకు సుమారు 3000 మంది పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఆహ్వానితులు పాల్గొంటారని అంచనా వేస్తూ ఏర్పాట్లపై చర్చించారు. 2026 జనవరి 4వ తేదీ (ఆదివారం) స్వర్ణోత్సవాలను నిర్వహించేందుకు తీర్మానం చేయడంతో పాటు, కార్యక్రమాల నిర్వహణకు వేదికలు, ఏర్పాట్లపై పరిశీలన కూడా చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు, పనిచేసిన పూర్వ ఉపాధ్యాయులు, సిబ్బంది అందరూ స్వర్ణోత్సవాల్లో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్. శ్యాం కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ జీ. రమేష్, సీనియర్ పూర్వ ఉపాధ్యాయులు ఎన్. చక్రవర్తి, ఎస్.కె. ఖాదర్, రమేష్ రెడ్డి దారావత్ వెంకన్న, పూర్వ విద్యార్థులు రమేష్ రాథోడ్, పీక్ల, పడిగా సత్యనారాయణ, రవి రాథోడ్ శ్రీనివాస్, కత్తి శ్రీను, మాంజ్య కృష్ణ గుగులోత్, రామకృష్ణ, పొడియం వెంకటేశ్వర్లు, రాణా ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.