calender_icon.png 15 December, 2025 | 8:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ కన్నెర్ర

15-12-2025 05:54:53 PM

హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, ఆ పార్టీ నాయకుల గూండాగిరి రోజురోజుకూ శృతి మించుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జరిగిన అమానుష ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ నేతలు భౌతిక దాడులకు తెగబడటం పిరికిపంద చర్య అని మండిపడ్డారు.

ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సోమార్‌పేట్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ఫలితాల అనంతరం ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామంలో బీఆర్ఎస్ తరపున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన బిట్ల బాలరాజు, ఫలితాల తర్వాత తన కుటుంబ సభ్యులు, అనుచరులతో కలిసి ఇంటి ముందు కూర్చుని ఉన్నారు. ఈ క్రమంలో ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి స్థానిక మండల అధ్యక్షుడు సాయిబాబా ట్రాక్టర్‌తో అక్కడకు వచ్చి బీభత్సం సృష్టించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. నన్ను ఎవరూ ఏం చేయలేరు అంటూ విర్రవీగుతూ.. నిల్చున్న వారిపైకి ట్రాక్టర్ ఎక్కించి ఢీకొట్టారు.

ఈ దాడిలో బీఆర్ఎస్ అభ్యర్థి బాలరాజుతో పాటు ఆయన అనుచరులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వెంటనే కేటీఆర్, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్ చార్జ్, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌కు ఫోన్ చేసి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. పార్టీ వారికి అండగా ఉంటుందని, అధైర్య పడవద్దని భరోసా కల్పించారు. అనంతరం కామారెడ్డి జిల్లా ఎస్పీకి కేటీఆర్ స్వయంగా ఫోన్ చేసి సోమార్‌పేట్ ఘటనను వివరించి, బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అధికారం ఉంది కదా అని కాంగ్రెస్ నేతలు హత్యాయత్నాలకు పాల్పడుతుంటే పోలీసులు చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు.  రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగితే బీఆర్ఎస్ శ్రేణులు చూస్తూ ఊరుకోబోమని, ప్రజలు, కార్యకర్తలు తిరగబడే రోజు దగ్గర్లోనే ఉందని కేటీఆర్ హెచ్చరించారు. అదే జరిగితే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని, అప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. చట్టం తన పని తాను చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేశారు. గాడి తప్పిన కాంగ్రెస్ నేతలను కట్టడి చేయాల్సిన బాధ్యత పోలీసులదే అని కేటీఆర్ తేల్చిచెప్పారు.