calender_icon.png 18 January, 2026 | 6:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెంగాల్‌లో 'జంగిల్‌ రాజ్‌'కు వీడ్కోలు

18-01-2026 04:44:56 PM

సింగూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) ఆదివారం పశ్చిమ బెంగాల్‌లో రూ. 830 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. కోల్‌కతాను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే మూడు అమృత్ భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) 15 ఏళ్ల 'మహా జంగిల్ రాజ్'కు ముగింపు పలికే సమయం ఆసన్నమైందన్నారు. టీఎంసీ దుర్పాలనతో ప్రజలు విసిగిపోయారని, బెనర్జీని, ఆమె పార్టీని అధికారం నుండి తొలగించాలని కోరుకుంటున్నారని, కాబట్టి పశ్చిమ బెంగాల్‌కు మార్పు అవసరమని సూచించారు.

హుగ్లీ జిల్లాలోని సింగూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మాట్లాడుతూ, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రాష్ట్రంలోని యువత, మహిళలు, రైతులు, మత్స్యకారులకు శత్రువు అని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ మాత్రమే పశ్చిమ బెంగాల్‌లో అభివృద్ధిని వేగవంతం చేయగలదన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయకుండా టీఎంసీ అడ్డుకుంటోందని కూడా ప్రధాని మోదీ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ కోసం తన ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరిస్తూ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే బెంగాలీ భాషకు శాస్త్రీయ భాష హోదా లభించిందని ప్రధాని మోదీ వెల్లడించారు కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ)లో టీఎంసీ భాగస్వామిగా ఉన్నప్పటికీ, బెంగాలీకి శాస్త్రీయ భాష హోదా లభించేలా చూడలేకపోయిందని తెలిపారు.

టీఎంసీ చొరబాట్లకు మద్దతు ఇస్తోందని ప్రధాని ఆరోపించారు. సరిహద్దుల వెంబడి కంచె వేయడానికి కేంద్రం భూమిని కోరుతున్నప్పటికీ, టీఎంసీ తన ప్రభుత్వానికి ఎలాంటి మద్దతు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చొరబాటుదారుల కోసం పత్రాలు తయారు చేయడంలో మమత బెనర్జీ పార్టీ పాలుపంచుకుంటోందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను బీజేపీకి ఓటు వేయాలని కోరారు. తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలతో పాటు, 294 మంది సభ్యులు గల పశ్చిమ బెంగాల్ శాసనసభకు ఎన్నికలు ఈ సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ నెలలో జరిగే అవకాశం ఉంది. ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై బెంగాల్ సీఎం ఎలా స్పందిస్తారో చూడాలి.