18-01-2026 05:13:26 PM
ఖమ్మం జిల్లా కమ్యూనిస్టుల గడ్డ
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం నాడు ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఖమ్మం డిగ్రీ కాలేజీలో సీపీఐ శతాబ్ది ముగింపు ఉత్సవాల సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ... మతతత్వశక్తులకు వ్యతిరేకంగా ఎర్రజెండా తలెత్తి నిలబడుతుందన్నారు. కమ్యూనిస్టు కంచుకోట ఖమ్మంలో ఈ సభ జరగడం హర్షణీయం అన్నారు. కమ్యూనిస్టుల స్ఫూర్తితోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడామని వివరించారు. కాంగ్రెస్, కమ్యూనిస్టుల పోరాటంతోనే స్వాతంత్య్రం వచ్చిందని వెల్లడించారు.
దున్నేవాడిదే భూమి అని కమ్యూనిస్టు పార్టీ(CPI party) నినాదం ఇచ్చింది.. కమ్యూనిస్టు నినాదాన్ని కాంగ్రెస్ సర్కారు చట్టం చేసిందన్నారు. రజాకార్లకు, నిజాంకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాడారని గుర్తుచేశారు. సాయుధపోరాటంలో 4 వేల మంది కమ్యూనిస్టు వీరులు నేలకోరిగారని మననం చేసుకున్నారు. కమ్యూనిస్టు వీరుల త్యాగంతోనే నిజాం నుంచి విముక్తి బీజం పడిందని చెప్పారు. పేదలను అణిచివేయాలని బీజేపీ చూస్తోందని ధ్వజమెత్తారు. అది బీజేపీ కాదు.. బ్రిటిష్ జనతా పార్టీ అన్నారు. కాంగ్రెస్ జాతీయ ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చింది.. ఎన్డీఏ సర్కారు ఉపాధి హామీ చట్టం రద్దు చేసిందని ఆరోపించారు.
ఉపాధి హామీ రద్దుతో మళ్లీ వలసలు మొదలవుతాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ రద్దుతో బడా కంపెనీలకు చౌకగా కూలీలు దొరుకుతారని వివరించారు. ఎస్ఐఆర్ ద్వారా పేదల ఓటు హక్కును కేంద్రం రద్దు చేస్తోందని విమర్శించారు. ప్రధాని మోదీ, అమిత్ షా వచ్చినా ఖమ్మం జిల్లాలో సర్పంచ్ ను కూడా గెలిపించుకోలేరని సీఎం రేవంత్ సవాల్ చేశారు. మోదీకి వ్యతిరేకంగా పోరాటంలో కమ్యూనిస్టులు కలిసి రావాలని పిలుపునిచ్చిన రేవంత్ రాహుల్ గాంధీని ప్రధాని చేసుకుందామని తెలిపారు. సీపీఐ శతాబ్ది ముగింపు ఉత్సవాల్లో(CPI 100 Years Celebrations) డి. రాజా, అమర్ జీత్ కౌర్, నారాయణ, రామకృష్ణ, ఎమ్మెల్యే కూనంనేని, పల్లా వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.