కొద్దిరోజుల్లో మోదీ ఏడ్వటం పక్కా

27-04-2024 12:38:11 AM

ఇప్పటికే ప్రసంగాల్లో  భయపడుతున్నారు

సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చుతున్నారు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యలు

బీజాపుర్ (కర్ణాటక), ఏప్రిల్ 26: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శలు చేశారు. మోదీ తన ప్రసంగాల్లో భయపడుతున్నారని, మరికొద్ది రోజుల్లో వేదికలపైనే ఏడుస్తారని రాహుల్ ఎద్దేవా చేశారు. కర్ణాటకలోని బీజాపుర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ..మీరు ప్రధాని మోదీ ప్రసంగాలు విన్నారు. ఆయన భయపడుతున్నారు. ఆయన సభావేదికలపైనే ఏడ్చే అవకాశం ఉంది అంటూ ఎగతాళి చేశారు. దేశంలోని ప్రధాన సమస్యలైన పేదరికం, నిరుద్యోగం, ధరల పెరుగుదలను విస్మరించి ప్రజల దృష్టిని మరల్చేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మోదీ మీ దృష్టిని మరల్చుతున్నారు. ఓసారి చైనా, పాకిస్థాన్ గురించి మాట్లాడుతారు. మరోసారి ప్లేట్లను కొట్టండని, మీ మొబైల్ టార్చ్ లైట్లు ఆన్ చేయాలని చెబుతారు. కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు తగ్గించి ముస్లింలకు ఎక్కువ కేటాయిస్తారని ఆరోపిస్తున్నారు. కానీ కాంగ్రెస్ వస్తేనే నిరుద్యోగ సమస్యను నిర్మూలిస్తుంది. ధరల పెరుగుదలను నియంత్రిస్తుంది అని రాహుల్ పేర్కొన్నారు. 

పేదల నుంచి లాక్కొని కోటీశ్వరులకు..

దేశంలో ప్రజల సంపదను దోచుకుని కొంతమందిని మాత్రమే కోటీశ్వరులను చేశారని మోదీపై రాహుల్ మండిపడ్డారు. 70 కోట్ల మంది ప్రజల వద్ద ఉన్నంత సంపద 22 మంది ఆస్తికి సమానమని తెలిపారు. దేశంలోని 40 శాతం సంపద కేవలం ఒక శాతం వ్యక్తుల వద్దే ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధనవంతులకు మోదీ ఇచ్చిన మొత్తాన్ని తాము పేద ప్రజలకు అందిస్తామని హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. తప్పుడు జీఎస్‌టీ 5 రకాల పన్నులను విధించారని మోదీపై ఆరోపణలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు గతంలో ఎప్పుడూ జరగలేదని, ఒక పార్టీ, ఒక వ్యక్తి కలిసి రాజ్యాంగంతో పాటు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.