31-10-2025 11:03:36 AM
 
							గాంధీనగర్: గుజరాత్ లోని నర్మదా నది ఒడ్డున సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) పాల్గొన్నారు. నది మధ్యలో 182 అడుగుల పటేల్ విగ్రహం వద్ద ప్రధాని నివాళులర్పించారు. ఏక్తా దివస్(Rashtriya Ekta Diwas)ను పురస్కరించుకుని పటేల్ విగ్రహానికి ఆయన అంజలి ఘటించారు. హెలికాప్టర్ నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహంపై పూలవర్షం కురిపించారు. సైనిక దళాల నుంచి ప్రధాని గౌరవ వందనం స్వీకరించారు. సాయుధ దళాలకు నరేంద్ర మోదీ సెల్యూట్ చేశారు. సాయుధ దళాలు, స్థానికులతో కలిసి ప్రధాని ఐక్యతా ప్రమాణం చేశారు.
అనంతరం ప్రధాని మాట్లాడుతూ... స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల మాదిరిగానే ఏక్తా దివస్ జరుపుకుంటున్నామని ప్రధాని పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రత్యేక నాణెం, స్టాంపు విడుదల చేశారు. దేశ ఐక్యత కోసం అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చరిత్ర సృష్టించారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారతీయులంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రధాని పిలుపునిచ్చారు. విభజన శక్తులకు ప్రజలు దూరంగా ఉండాలని కోరారు. కాశ్మీర్ విషయంలో కాంగ్రెస్ తప్పుచేసిందని ప్రధాని ఆరోపించారు. దేశ సమగ్రతను నక్సలిజం ముప్పుగా పరిణమించిందని తెలిపారు. నక్సల్స్ ఏరివేత లక్ష్యంగా ఎన్నో ఆపరేషన్లు చేశామన్నారు. నక్సలిజం మూలాలను సమూలంగా పెకలిస్తామని స్పష్టం చేశారు.
పటేల్ అభిప్రాయాలను నెహ్రూ గౌరవించలేదని మోదీ పేర్కొన్నారు. పటేల్, అంబేద్కర్ ను కాంగ్రెస్ అవమానించిందని ప్రధాని స్పష్టం చేశారు. పటేల్ దూరదృష్టిని కాంగ్రెస్ మరచిపోయిందని సూచించారు. కాంగ్రెస్ చేసిన తప్పు వల్ల కాశ్మీర్ లో కొంతభాగాన్ని పాకిస్థాన్ ఆక్రమించిందని ప్రధాని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ బలాన్ని ప్రపంచం మొత్తం చూసిందని చెప్పారు. దేశ ఐక్యతను బలోపేతం చేసే చర్యలను ప్రోత్సహిస్తామని ప్రధాని వెల్లడించారు. అక్రమ వలసదారులపై చర్యలు తీసుకుంటుంటే కొందరికి బాధగా ఉందని మోదీ అన్నారు. దేశం నుంచి చొరబాటుదారులను తరిమికొట్టాలని ప్రతిజ్ఞ చేద్దాం అని ప్రధాని ప్రజలకు పిలుపునిచ్చారు. కాశ్మీర్ మొత్తాన్ని భారత్ లో కలపాలని పటేల్ ఆకాంక్షించారని, వల్లాభాయ్ పటేల్ ఆంకాంక్షలను నెహ్రూ గౌరవించలేదని చెప్పారు. కాశ్మీర్ కు ప్రత్యేక రాజ్యాంగం, జెండాను ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ బలహీన విధానాల వల్ల కాశ్మీర్ కొంత ఆక్రమణకు గురైందన్నారు. పాక్ ఆక్రమణ వల్ల కాశ్మీర్, దేశంలో అశాంతి నెలకుందని ప్రధాని సూచించారు. ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ పెంచి పోషిందని ఆయన పునరుద్ఘాటించారు. ఇంత జరిగినా ఉగ్రవాదుల ముందు కాంగ్రెస్ తలవంచిందని ధ్వజమెత్తారు. 'పటేల్ ఆకాంక్షను కాంగ్రెస్ గౌరవించలేదు.. మేము గౌరవించాం' అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.