06-06-2025 06:05:34 PM
జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల
నిర్మల్,(విజయక్రాంతి): ఇటీవలి కాలంలో కొందరు వ్యక్తులు చైల్డ్ పోర్న్ వీడియోలు(Child Porn Videos) చూడటం, వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం, వివిధ సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేయడం, ఫార్వార్డ్ చేయడం వంటి చట్టవిరుద్ధమైన చర్యలకు వారిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు జిల్లా ఎస్పీ జానకి షర్మిల(Nirmal SP Dr.G.Janaki Sharmila) తెలిపారు శుక్రవారం జిల్లా ఎస్పీ జానకి మాట్లాడుతూ... ఇటువంటి చర్యలు చట్టరీత్యా నేరమని, వీటిని ఎంతమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం లేదా గూగుల్‌లో వాటి కోసం వెతకడం వంటి చర్యలను జిల్లా పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణిస్తుందని జిల్లా ఎస్పీ గారు స్పష్టం చేశారు. చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది ఒక తీవ్రమైన నేరమని, దీనికి పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠినమైన పోక్సో కేసులు చేయబడతాయని హెచ్చరించారు.
పోర్న్ వీడియోలు చూడటం, వాటిని తయారు చేయడం, పంపిణీ చేయడం, ప్రచారం చేయడం వంటి కార్యకలాపాలు సమాజంలో అసభ్యతను వ్యాప్తి చేయడమే కాకుండా, మహిళలు మరియు పిల్లల గౌరవాన్ని దిగజారుస్తాయి. అంతేకాకుండా, ఇది సైబర్ నేరాల పరిధిలోకి వస్తుంది మరియు సంబంధిత చట్టాల ప్రకారం కఠినమైన శిక్షార్హమైన చర్యలకు దారితీస్తుంది. జిల్లాలో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై జిల్లా ఐటీ నిపుణులు ద్వారా నిందితులను గుర్తించి, ఇదివరకే వారిపై తగిన కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
ప్రజలందరూ ఇటువంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా యువత సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా ఉపయోగించాలి మరియు ఇటువంటి తప్పుదోవ పట్టించే విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి" అని తెలిపారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల సోషల్ మీడియా వినియోగంపై నిఘా ఉంచాలని, వారికి సరైన మార్గనిర్దేశం చేయాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడినట్లు గుర్తిస్తే, వెంటనే 8712659599 కు సమాచారం అందించాలని కోరారు.