24-01-2026 01:12:17 AM
పోలీసులపై నోరు పారేసుకుంటే సహించం
పోలీస్ అధికారుల సంఘం హెచ్చరిక
హైదరాబాద్, సిటీ బ్యూరో జనవరి 23 (విజయక్రాంతి): రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న కేసుల విచారణ వేళ.. పోలీసు శాఖపై బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం భగ్గుమంది. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ముఖ్య నేత హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలను ఆ సంఘం తీవ్రంగా పరిగణించింది. రాజకీయ లబ్ధి, కేసుల నుంచి తప్పించుకునేందుకు పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించింది.
వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, పోలీసు శాఖకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో సివిల్, క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిక జారీ చేసింది. శుక్రవారం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపిరెడ్డి ప్రకటన విడుదల చేశారు. పోలీసులు ప్రాణాలకు తెగించి, శాంతిభద్రతల పరిరక్షణకు అహోరాత్రులు విధులు నిర్వహిస్తుంటే అవమానించడం సరికాదని హితవుపలికారు.
పిలిచే అధికారం మాకుంది..
కేసుల దర్యాప్తులో భాగంగా సాక్ష్యాధారాల సేకరణకు, లేదా సేకరించిన వాటిని సరిచూసుకోవడానికి ఎవరినైనా, ఎప్పుడైనా పిలిచే సంపూర్ణ అధికారం దర్యాప్తు అధికారికి ఉంటుందని సంఘం స్పష్టం చేశారు. కేసులో తుది నిర్ణయం కోర్టులే తీసుకుంటాయని తెలిపారు. దర్యాప్తు కొనసాగుతున్న కీలక సమయంలో అధికారులపై నిరాధార ఆరోపణలు చేయడం న్యాయ ప్రక్రియను ప్రభావితం చేయడమే అవుతుందని పేర్కొన్నారు. ఇవి శిక్షార్హమైన నేరాలని హెచ్చరిం చారు. తమకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషాలు, కక్షలు లేవని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు.
వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి
సీనియర్ పోలీసు అధికారులను టార్గెట్ చేస్తూ హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలను భేషరతుగా ఉపసంహరించుకోవాలని గోపిరెడ్డి డిమాండ్ చేశారు. బహిరంగ క్షమాపణ చెప్పకపోతే.. చట్టపరమైన యుద్ధానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.