29-04-2025 12:32:59 AM
కరీంనగర్ క్రైం, ఏప్రిల్ 28 (విజయ క్రాంతి): వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, కరీంనగర్ బస్టాండ్‌లో చోటుచేసుకునే దొంగతనాలు, ఇతర నేరాలను అరికట్టేందుకు కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు అవుట్‌పోస్ట్‌ను ఏర్పాటు చేశారు. సోమవారం పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఈ అవుట్‌పోస్ట్‌ను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ బస్టాండ్‌లో ప్రయాణికులకు ఎదురయ్యే ఇబ్బందులను తొలగించడానికి, ముఖ్యంగా దొంగతనాల నియంత్రణకు ఈ అవుట్‌పోస్ట్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఇప్పటికే బస్టాండ్ ఆవరణలో ఉన్న 45 సీసీ కెమెరాలను కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశామని తెలిపారు. భవిష్యత్తులో అవసరమైన ప్రాంతాల్లో మరో 15 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను కోరినట్లు వెల్లడించారు.
ఈ పోలీస్ అవుట్‌పోస్ట్‌లో 24 గంటల పాటు పోలీసు అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారని కమిషనర్ తెలిపారు. బస్టాండ్‌లో ప్రయాణికులకు ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే ఈ అవుట్‌పోస్ట్‌ను సంప్రదించవచ్చని ఆయన సూచించారు. జేబు దొంగల చిత్రాలను ప్రజలకు కనిపించేలా ప్రత్యేక బోర్డులపై ప్రదర్శిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల కరీంనగర్ బస్టాండ్‌లో ప్రయాణికుల బ్యాగులు దొంగతనం చేస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారని కమిషనర్ గుర్తు చేశారు. అతని వద్ద నుంచి 150 గ్రాముల బంగారం, 10 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ప్రయాణికులు తమ లగేజీ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఏసీపీ వెంకటస్వామి, కరీంనగర్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్, ఎస్సు రాజన్న, ఆర్టీసీ అధికారులు ఎస్ భూపతి రెడ్డి (డిప్యూటీ రీజనల్ మేనేజర్), డిపో మేనేజర్‌లు విజయ మాధురి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.