16-10-2025 08:14:22 PM
కరీంనగర్ సీపీ గౌస్ ఆలం..
కరీంనగర్ క్రైం (విజయక్రాంతి): గుండెపోటు వంటి అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడేందుకు అవలంబించాల్సిన సీపీఆర్ పద్ధతిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కరీంనగర్ పోలీసు కమిషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ అన్నారు. సీపీఆర్ అవగాహన వారోత్సవాలలో భాగంగా గురువారం కమిషనరేట్ కేంద్రంలోని అస్త్ర కన్వెన్షన్ లో పోలీసు అధికారులకు, సిబ్బందికి కంటి పరీక్షలతో పాటు సీపీఆర్ పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ సమాజంలో ఫస్ట్ రెస్పాండర్ గా పోలీసులు క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటారని సీపీ తెలిపారు. ముఖ్యంగా బ్లూ కోల్ట్స్ అధికారులు వెంటనే స్పందించి సీపీఆర్ చేసినట్లయితే ప్రాణాలను రక్షించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు.
ఈ మధ్యకాలంలో వయస్సుతో నిమిత్తం లేకుండా గుండెపోటు సంభవిస్తుండటం ఆందోళన కలిగిస్తోందని, అందువల్ల ప్రతి ఇంట్లోనూ కుటుంబ సభ్యులకు కూడా సీపీఆర్ పై అవగాహన అవసరమని సూచించారు. ఈ శిక్షణలో నేర్చుకున్న అంశాలను ఇతరులకు, కుటుంబ సభ్యులకు నేర్పించాలన్నారు. పోలీసు శాఖ తరుపున కమీషనరేట్లోని అన్ని పోలీసు స్టేషన్లకు (స్టేషన్ కి రెండు చొప్పున) డెమో బొమ్మలను కొనుగోలు చేసి సిబ్బంది రెగ్యులర్ ప్రాక్టీస్ కోసం అందజేస్తామని సీపీ ప్రకటించారు. శిక్షణలో భాగంగా వైద్యులు సీపీఆర్ సమయంలో చేయవలసిన, చేయకూడని పనులను గురించి డెమో ద్వారా సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, అడిషనల్ డీసీపీ వెంకటరమణ , భీం రావు, ప్రోగ్రామ్ ఆఫీసర్ సనా, డాక్టర్ నరేష్, తదితరులు పాల్గొన్నారు.