16-10-2025 10:31:12 PM
హనుమకొండ (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ బిల్లుకు తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు మద్దతు ప్రకటిస్తున్నారని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ అన్నారు. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కూరపాటి రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు, 90 శాతం ఉన్న సబ్బండ వర్గాల రాష్ట్ర నాయకత్వాలు అందరూ ఐక్యంగా ఏర్పడి 42 శాతం రిజర్వేషన్ కొరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మూకుమ్మడిగా పార్లమెంటులో బిల్లు పెట్టి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలి అని డిమాండ్ చేశారు.
అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ డాక్టర్ చందా మల్లయ్య మాట్లాడుతూ సబ్బండ వర్గాల రాష్ట్ర నాయకత్వం అన్ని వర్గాలను కలుపుకొని పోయి ఒకే ఉమ్మడి కార్యాచరణ 42 శాతం రిజర్వేషన్ రాష్ట్ర సాధన సమితిగా ఏర్పడి, కేంద్ర ప్రభుత్వాల రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి హైదరాబాద్ నగరంలో భారీ ఎత్తున రెండున్నర కోట్ల బహుజనులము పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ పార్లమెంటులో బిల్లు పెట్టి తొమ్మిదో షెడ్యూల్లో చేర్పించే వరకు విశ్రమించకుండా అనేక ఉద్యమాలను చేపడుతూ 42 శాతం సాధించాలని డిమాండ్ చేశారు.
వరంగల్ జిల్లా బిసి మేధావుల వేదిక కోఆర్డినేటర్ మండల పరుశరాములు మాట్లాడుతూ స్వాతంత్రం సిద్ధించి 70 సంవత్సరాలు అయినప్పటికీ, బీసీలు రాజ్యాధికారం రాకపోవడానికి అగ్రకుల రాజకీయ పార్టీలు ఎప్పటికీ అడ్డుపడుతూ ఉండటం చాలా బాధాకరం బీసీలు సంఘటితంగా కలిసి మెలిసి 42 రిజర్వేషన్లు సాధించడానికి ప్రతి గ్రామంలోని బిసి బహుజన కుల సంఘాల నాయకులు కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కె వీరస్వామి, బీసీ,ఎస్సీ, ఎస్టీ కోఆర్డినేటర్లు మేకల సుమన్ పొదిలి సాయిబాబా , రోడ్డ మురళి కృష్ణ, హనుమకొండ జిల్లా అధ్యక్షులు మైదం రవి, వరంగల్ జిల్లా అధ్యక్షులు కట్కూరి సునీల్, రాజన్న నాయక్, కొట్టే ఏసేపు, చెక్క సురేష్, గైని రవీందర్, జంగిలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.