22-10-2025 12:53:28 AM
- షాడో వీసీ తరహాలో ఓ పీఏ
- డెవలప్‌మెంట్ వర్క్స్ నుంచి రిక్రూట్‌మెంట్ వరకు సర్వంతర్యామి
- నియమాకాలకు సైతం అడ్డు
- పాలన వ్యవహారాల్లోనూ మితిమిరిన జోక్యం
- దాదాపు రెండు నెలలుగా పెండింగ్ ఫైల్స్
నల్లగొండ, అక్టోబర్ 21(విజయక్రాంతి) : దేవుడు వరం ఇచ్చినా.. పూజారి కరుణించని చందంగా మారింది మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిస్థితి. నల్లగొండ జిల్లాలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో పొలిటికల్ పవర్ ఎక్కువయ్యింది. అక్కడ ఏ పని జరగాలన్నా.. ఓ ప్రజాప్రతినిధికి సంబంధించిన పీఏ అనుమతి తప్పనిసరిగా మారింది. ఎంజీ యూనివర్సిటీల జరిగే ప్రతిపనిలోనూ మీతిమిరీన జోక్యం వల్ల యూనివర్సిటీ అధికారులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు.
అభివృద్ది పనుల దగ్గరి నుంచి ఔట్ సోర్సింగ్ రిక్రూట్‌మెంట్ వరకు సదరు పీఏనే సర్వంతర్యామిగా మారారు. ప్రజాప్రతినిధి సైతం పీఏకు ఫుల్ సపోర్టుగా ఉంటారనే ప్రచారం ఉండడంతో యూనివర్సిటీ అధికారులు సైతం కిమ్మనకుండి పోయారు. దీంతో ఎంజీ వర్సిటీలో పాలన పడకేసింది. తాజాగా యూనివర్సిటీ పాలన వ్యవహారాల్లో కీలకంగా ఉండే ఓ విభాగానికి సంబంధించిన ఫైల్‌ను దాదాపు గత రెండు నెలలుగా సదరు పీఏ తొక్కి పెట్టడం విమర్శలకు తావిస్తోంది.
వర్సిటీ వ్యవహారాల్లో అతి జోక్యం..
ఎంజీ వర్సిటీ నల్లగొండ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉంటుంది. కానీ ఈ ప్రాంతం నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. దీంతో రెండు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, లీడర్లు వర్సిటీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం పరిపాటిగా మారింది. గతంలో ఈ పరిస్థితి తక్కువగా ఉండేది. కానీ ఇటీవల కాలంలో వర్సిటీ వ్యవహారాల్లో ఓ పీఏ అతి జోక్యం చేసుకుంటుండడంతో వర్సిటీ అధికారులు సైతం ఏ పని చేయలేక ముందుకు సాగడం లేదు.
వదలమంటే పాముకు కోపం.. కరవమంటే కప్పకు కోపం అన్న చందంగా వర్సిటీ అధికారుల పరిస్థితి మారింది. అయితే సదరు పీఏ ఓ కీలక ప్రజాప్రతినిధి దగ్గర పనిచేస్తుండడం.. జిల్లా రాజకీయాల్లో ఆయన కీలకం కావడంతో అధికారులు సైతం ఏం చేయలేకపోతున్నారు. ఎంజీ యూనివర్సిటీలో సదరు పీఏ వ్యవహారం వల్ల పాలన కుంటుపడుతున్నా.. సదరు ప్రజాప్రతినిధి సైతం స్పందించకపోవడం కొసమెరుపు. ఒక్క మాటలో చెప్పా లంటే.. సదరు పీఏ యూనివర్సిటీకి షాడో వీసీలా వ్యవహరిస్తున్నారంటే.. పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
పాలన ముందుకా.. వెనక్కా..?
పీఏ షాడో వీసీగా మారి వ్యవహరిస్తుండడం వల్ల వర్సిటీ పాలను మూడు అడుగులు ముందుకి.. ఆరు అడుగులు వెనక్కి అన్న తరహాలా మారింది. ఇటీవల వర్సిటీలో నిర్మించిన పలు నిర్మాణాల విషయంలోనూ కాంట్రాక్టర్లను ఇబ్బందులు పెట్టినట్టు తెలుస్తోంది. ఓ ఔట్‌సోర్సింగ్ రిక్రూట్‌మెంట్ నియమాకాలకు సంబంధించిన ఫైల్‌ను రెండు నెలలుగా నిలిపివేశారు. దీంతో పాలనాపరమైన వ్యవహారాల్లో సిబ్బంది కొరత వల్ల పనుల్లో జాప్యం నెలకొంది.
రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి అంతా సిద్ధం చేసినప్పటికీ తన వ్యక్తిగత కారణాల నేపథ్యంలో ఫైల్‌ను పక్కన పెట్టేశారు. ఇలా ప్రతి పనిలోనూ సదరు పీఏ వ్యవహారం ఇతర శాఖల్లోని అధికారులతో పాటు వర్సిటీ అధికారులకు సైతం తలనొప్పి వ్యవహారంగా మారింది. పీఏ తీరు వల్ల ఆ ప్రజాప్రతినిధికి సైతం చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉంది. అయినా పరిస్థితి మారడం లేదు. మరికొద్ది రోజులు ఇలాగే కొనసాగితే.. వర్సిటీ పాలన పడకేసి.. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి రావడం ఖాయమని చెప్పాలి.